అవగాహనా సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి
‘వక్ఫ్’ సవరణకు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ, నిరసన
ప్రజాశక్తి – కుక్కునూరు రూరల్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదం తెలిపినటువంటి వక్ఫ్ చట్ట సవరణ బిల్లు మైనారిటీలకు తీవ్ర నష్టం కల్గిస్తుందని, అటువంటి వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కుక్కునూరు చర్చి హాస్టల్ ఆవరణలో వక్ఫ్ చట్టంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సుకు మండలంలోని అన్ని గ్రామాల నుండి ముస్లిం మహిళలు, ముస్లిం పెద్దలు 300 మంది పాల్గొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి ఎ.రవి మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. వక్ఫ్ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా కేంద్రంలో బిజెపి పాలన సాగుతుందన్నారు. వక్ఫ్ బోర్డు చట్టసవరణ బిల్లుతో మైనారిటీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. దీని ప్రభావం కేవలం మైనార్టీలపైనే కాదని, భవిష్యత్తులో అటు హిందువులపై, ఇటు క్రైస్తవులపై పడుతుందన్నారు. అనంతరం స్థానిక సంజరు నగర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్కడి నుండి ప్రధాన సెంటర్ వరకు ముస్లిం మహిళలు, పురుషులు, పిల్లలు జాతీయ జెండాలను చేతబూని హిందూ.. ముస్లిం భాయి భాయి, ప్రజాస్వామ్య హక్కులను మతసామరస్యాన్ని కాపాడాలి, అన్ని మతాలను సమానంగా చూడాలి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ చట్ట సవరణను వెంటనే వెనక్కు తీసుకోవాలని నినదిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన సెంటర్లో అరగంట పాటు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి కుక్కునూరు సర్పంచి రావు మీనా, సిపిఐ, వైసిపి, సిపిఐ (ఎంఎల్) మాస్‌లైన్ నేతలు పూర్తి మద్దతు తెలిపి పాల్గొన్నారు. సిపిఎం నాయకులు యర్రంశెట్టి నాగేంద్రరావు, వై.సాయి, లక్ష్మయ్య, రమేష్, సిపిఐ జిల్లా నాయకులు మునీర్, చారి, లక్ష్మయ్య, బాబూరావు, వైసిపి నాయకులు తాండ్ర రాజేష్, వినోద్, రవి, సిపిఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా నాయకులు ఎస్‌కె.గౌస్, ఎస్‌కె.మున్నీ, కాంగ్రెస్ నాయకులు రాజులు, వీరయ్య, ముస్లిం నాయకులు ఖాదర్ బాబా, చాంద్‌పాషా, సలీం, ఖాజీ, చీరవల్లి, కుక్కునూరు మసీదుల ఇమాములు తదితరులు పాల్గొన్నారు
