సిఐటియు, వ్యకాస, రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన
బడ్జెట్ ప్రతులు దహనం
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గెద్దలకు పెట్టిన చందంగా కార్మికులు, రైతాంగంపై భారాలు వేసి కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టే బడ్జెట్‌గా ఉందని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరులోని వసంత మహల్ సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. కార్మిక, రైతాంగ వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను నిరసించండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.లింగరాజు, ఎ.రవి, పి.రామకృష్ణ, కె.శ్రీనివాస్‌లు మాట్లాడారు. దేశంలో నూటికి 70 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో కేవలం 2.51 శాతం, రూ.1,71,437 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారన్నారు. ఎరువుల రాయితీలో రూ.3,412 కోట్లు కోత విధించారని విమర్శించారు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల గురించి ప్రస్తావనే లేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధరలకు సంబంధించి బడ్జెట్‌లో జాడే లేదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి, విద్య, వైద్య రంగాలకు భారీగా నిధులు కోత పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,396 కోట్లు కేటాయించారని, నిర్వాసితుల పరిహారం, పునరావాసం గురించి ప్రస్తావనే లేదని మండిపడ్డారు. బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డిఐలను అనుమతించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు బి.సోమయ్య, వివిఎన్.ప్రసాద్, వైఎస్.కనకారావు, జె.గోపీ, గొట్టాపు రవి కిషోర్ పాల్గొన్నారు.
చింతలపూడి : ఎపి రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో చింతలపూడిలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పుల్లూరి సోమశేఖర్, జిల్లా కార్యదర్శి దంతా కృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, రైతు సంఘం నాయకులు జంగా రామచంద్రారెడ్డి, తక్కలపాడు ప్రసాద్, తాడిగడప మాణిక్యాలరావు, ఎం.సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేదల సొమ్మును కార్పొరేట్లకు దోచిపెట్టేలా ఉందని రైతు సంఘం మండల కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య విమర్శించారు. జీలుగుమిల్లి జాతీయ రహదారిపై రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపి ప్రతులను దహనం చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని, లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీతారామయ్య మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో ఎపికి కేంద్రం మళ్లీ మొండి చేయి చూపించిందని విమర్శించారు. ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన హామీలను పక్కన పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండలాధ్యక్షుడు దాసరి జానకి రామిరెడ్డి, నాయకులు కొండలరావు, శేషగిరిరావు, రామారావు, గాంధీ, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
