తాగునీటి ఎద్దడి నివారణకు అత్యధిక ప్రాధాన్యత
ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహార్
ప్రజాశక్తి – ఏలూరు
పేద ప్రజల సంక్షేమం కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లక్ష్య సాధనకు అధికారులంతా టీమ్‌వర్క్‌తో పని చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్ సూచించారు. బుధవారం స్దానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఏలూరు జిల్లాను ఐదో స్ధానం నుంచి మూడో స్థానానికి తీసుకురావాలన్నారు. ల్యాండ్ అసైన్‌మెంట్‌లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రణాళికాబద్దంగా ల్యాండ్‌బ్యాంక్ ఏర్పాటు చేసి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్ధితులు కల్పించాలన్నారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పి-4 కింద ప్రతి కుటుంబంలో ఒకరికి ఉపాధి, వ్యాపారవేత్తగా తీసుకురావడానికి అనువైన పరిస్ధితులు కల్పించాలన్నారు. జిల్లాలో వెదురుతో తయారుచేసే ఉత్పత్తులకు ఇతర జిల్లాల్లో మార్కెటింగ్ సదుపాయం కలిగేలా నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. అవసరమైన వెదురు సరఫరాలో ఎటువంటి అవరోధాలూ లేకుండా అటవీశాఖ అధికారులు చూడాలన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో దశలోనూ లబ్దిదారులకు అందించడంలో ఎంపిడిఒలు, తహశీల్దార్లు సమిష్టిగా సమీక్షించాలన్నారు. హౌసింగ్ విషయంలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. తాగునీటి విషయంలో అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. దీనికోసం కలెక్టర్ వారి దగ్గర అందుబాటులో నిధులు ఉంచామన్నారు. పోలవరం ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులకు ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాలన్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ప్రతినెలా రెండు, మూడు రోజులు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా తహశీల్దార్లు తమ స్ధాయిలో స్పందిస్తే కలెక్టర్, జెసి వరకు రావని ఆయన స్పష్టం చేశారు. పిజిఆర్‌ఎస్‌లో అందే అర్జీలను వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలన్నారు. సమావేశంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డిఆర్‌ఒ వి.విశ్వేశ్వరరావు, సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
