పెళ్లికొడుకుతో సహా ఆరుగురికి గాయాలు
ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం
ఉంగుటూరు :శుక్రవారం రాత్రి 9.04 గంటలకు ఏలూరులో పెళ్లి. పాలకొల్లు నుంచి పెళ్లికొడుకు కుటుంబ సభ్యులతో కారులో బయల్దేరారు. ఆ కారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఉంగుటూరు మండలం నాచుగుంట వద్దకు వచ్చేసరికి ప్రమాదానికి గురైంది. హైవే సిబ్బంది క్షతగాత్రులందరినీ ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. పెళ్లికొడుకుకు స్వల్ప గాయాలు కావడం, అతని కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో పెళ్లివారి ఇంట ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాలకొల్లు నుంచి ఏలూరు వైపు వెళ్లే పెళ్లి కారు ఉంగుటూరు మండలం నాచుగుంట వద్దకు వచ్చేసరికి ఉంగుటూరు ఊళ్లోంచి కాల్వగట్టు మీదుగా ప్రయాణించి నాచుగుంట వద్ద జాతీయ రహదారిపైకి ఆకస్మికంగా వచ్చి ఏలూరు వైపు వెళ్తున్న కారును ఢకొీంది. పైగా కొంతదూరం కారును ఈడ్చుకుపోయింది. కారులో ఎడమవైపు బెలూన్ ఓపెన్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారును పెళ్లికొడుకే నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో జి.పద్మావతి, కె.నాగేశ్వరరావు, జి.నాగమణి తీవ్ర గాయాలవ్వగా పెళ్లి కొడుకు జి.నవీన్, జి.ప్రవీణ్‌కుమార్, పి.రాజేంద్రప్రసాద్‌లకు స్పల్ప గాయాలయ్యాయి. నలుగురిని హైవే అంబులెన్సులో, ఇద్దరిని హైవే పోలీసు వాహనంలో ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. చేబ్రోలు పోలీసులు, హైవే సిబ్బంది ప్రమాదం జరిగిన క్షణంలోనే క్షతగాత్రులను కారుల్లోంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించడంలో వేగంగా స్పందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చేబ్రోలు ఎస్‌ఐ సూర్యభగవాన్ వెల్లడించారు. ఒకపక్క పెళ్లి ముహూర్తం సమీపించడం, మరోపక్క పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలతో ఇరువైపులా విషాదం నెలకొంది.
