పేరుకే స్వచ్ఛందం.. అంతా నిర్బంధమే

తాజాగా పాఠశాలల కేటగిరీల మార్పుపై తీర్మానాలు ఇవ్వాలని ఆదేశాలు
ప్రజాశక్తి – మండవల్లి
ప్రభుత్వాల నిర్ణయాలతో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానం ప్రయోగశాలగా మారిపోయింది. జాతీయ విద్యా విధానం 2020 కేంద్రం సూచించినప్పటికీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌ తప్ప మరే ఇతర రాష్ట్రంలోనూ అమల్లోకి రాలేదు. గత ప్రభుత్వం జిఒ నెం.117తో ప్రారంభమైన నూతన విద్యా విధానం. దాని రద్దు పేరుతో మరింత తీవ్ర సంక్షోభంలోకి ప్రభుత్వ పాఠశాలలను తీసుకెళ్తున్నారని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ పాఠశాలల కేటగిరి మార్పుపై మొదట ఎస్‌ఎంసి అభిప్రాయాలు, తీర్మానాలు తప్పనిసరి అని రాష్ట్ర అధికారులు తెలిపారు . అందులో భాగంగా మెజారిటీ పాఠశాలల ఎస్‌ఎంసిలు తరగతుల తరలింపు, ప్రాథమికోన్నత పాఠశాలల కుదింపుపై వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయి. దీంతో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఎస్‌ఎంసి ఛైర్మన్లను కొందరిని కలెక్టర్‌ వద్దకు పిలిచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ ద్వారా నూతన పాఠశాలల విధానం గురించి పూర్తిస్థాయిలో చెప్పించి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎస్‌ఎంసిలది అభిప్రాయం చెప్పడం వరకే తప్ప నిర్ణయం ప్రభుత్వానిదే అన్నట్లు వ్యవహరించారు. దీంతో ఇంతదూరం తమను ఎందుకు రప్పించడం అంటూ ఎస్‌ఎంసి ఛైర్మన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.తాజా ఆదేశాలతో హెచ్‌ఎంల తంటాలు తాజాగా విద్యాశాఖ శుక్రవారం సాయంత్రంలోపు ఎస్‌ఎంసి అంగీకార పత్రాన్ని తీసుకుని ఎంఇఒ లాగిన్‌ నుండి అప్‌లోడ్‌ చేయాలని తెలపడంతో హెచ్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఒకపక్క యుపి పాఠశాలల్లో తరగతుల కుదింపు, ఎఫ్‌పి పాఠశాలలుగా అనేక పాఠశాలల్లో తరగతుల తరలింపుపై గతంలోనే వ్యతిరేకంగా తీర్మానం చేయగా మళ్లీ ఎస్‌ఎంసి అంగీకార తీర్మానపత్రం ఇవ్వాలని తెలపడంతో ఏ విధంగా ఎస్‌ఎంసి సభ్యులకు నచ్చజెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ముందుచూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి ఎలా ఉందని హెచ్‌ఎంలు వాపోతున్నారు. స్వచ్ఛందం నుండి నిర్బంధంగా అంగీకార పత్రాలు ఇవ్వాలని ఆదేశాలతో పని చేయాలో, లేదో తెలియడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. గురువారం ఒక్క రోజే మూడు రకాల తీర్మానాలు మార్చి మార్చి చివరకు అధికారులు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఉన్నటు వంటి తీర్మానాన్ని అందించి కేవలం హెచ్‌ఎం, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ సంతకాలతో ఉదయం 11 గంటల్లోపు కాపీలు అందించాలని ఒత్తిడి తీసుకొచ్చారంటే పరిస్థితి ఎంత స్వచ్ఛందమో అర్థమవుతోందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొంత మంది ఎంఇఒలు పైనుంచి ఒత్తిడి ఫలితంగా ప్రధానోపాధ్యాయులపై బెదిరింపు ధోరణితో మాట్లాడారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.మోడల్‌ పాఠశాలల పేరుతో తరలింపు తరగతికి ఒక టీచర్‌ అనే పేరుతో మండలానికి ఎనిమిది నుండి 15 వరకు మోడల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. మొదట్లో 60 మందికిపైగా విద్యార్థులు ఉంటే ఐదుగురు టీచర్లను కేటాయిస్తూ ఎంపిఎస్‌లను ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో అనేక పంచాయతీల్లో తరగతుల తరలింపు జరిగింది. అయినప్పటికీ 60 మంది విద్యార్థులు లేకపోవడంతో ప్రస్తుతం 45 మంది విద్యార్థులు ఉన్న ఎంపిఎస్‌ (మోడల్‌ ప్రైమరీ స్కూల్‌)గా పరిగణిస్తూ ఈ పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయులను కేటాయిస్తున్నారు. అయితే అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారుతున్నాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా బేసిక్‌ ప్రైమరీ పాఠశాలల్లో 30 నుండి 40 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు అనేకం ఉన్నాయి. అయితే వాటిలో మాత్రం కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు. 45 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులను ఇచ్చినప్పుడు 30 నుండి 40 మంది విద్యార్థులు ఉన్నచోట కూడా మూడో ఉపాధ్యాయుడిని నియమించాలని సంఘాలు కోరుతున్నాయి. ఏదేమైనా మోడల్‌ పాఠశాలల్లో ప్రస్తుతం కన్పిస్తున్న విద్యార్థుల సంఖ్య పాఠశాలల ప్రారంభం నాటికి ఉంటుందో, లేదోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చేతులెత్తేసిన ఎంఎల్‌ఎలు తరగతుల తరలింపు, యుపి పాఠశాలల కుదింపుపై ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు ఎంఎల్‌ఎలను ఆశ్రయించినప్పటికీ ఇది ప్రభుత్వ నిర్ణయమని, తామేమీ చేయలేమని చెబుతుండటం గమనార్హం. ఏదేమైనా జిఒ నెం.117 రద్దు డిమాండ్‌ అమలు చేసినా, దాన్నే మరో రూపంలో మరింత ప్రమాదకరమైన విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, దీంతో ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️