చింతలపూడి అభివృద్ధికి సహకరిస్తాం
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి
ప్రజాశక్తి – చింతలపూడి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. దీపం పథకంలో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామన్నారు. మండలంలోని ఆర్‌కె ఫంక్షన్ హాలు వద్ద శుక్రవారం నిర్వహించిన దీపం-2 పథకం కార్యక్రమనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే పరిపాలన బాగా చేసి చూపిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం దోచుకొని దాచుకుందన్నారు. దీపం పథకంతో మహిళలకు ప్రయోజనం ఎంతో ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి వాటిని నెరవేర్చడమే టిడిపి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.2,684 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మొదటి విడతగా రూ.894 కోట్లు గ్యాస్ కంపెనీలకు చెల్లించిందని, గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న ఖాతాదారులకు సంబంధిత కంపెనీలు ఇంటికి వచ్చి సిలిండర్లను పంపిణీ చేస్తారని వివరించారు. లబ్ధిదారులు డబ్బులు చెల్లిస్తే 48 గంటల్లో తిరిగి డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ వల్ల రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇస్తున్నారని, అండగా ఉంటున్నారని చెప్పారు. పెన్షన్ పెంపు చేశామని, గత ప్రభుత్వం రూ.500 పెంచటానికి సంవత్సరం పట్టిందని, చంద్రబాబుకు ఒక్కరోజు పట్టిందని చెప్పారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వేస్తున్నామన్నారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగావకాశలు నిరుద్యోగులకు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. 2014 నుంచి 2019 సంవత్సరలో ఇల్లు కట్టుకుని బిల్లులు పడని వారికి బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. రోడ్లు అధ్వానంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జనవరి నాటికి రోడ్లపై ఎక్కడ గుంతలు ఉండకూడదని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణనికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లకు రూ.ఆరు కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. టిడిపి హయాంలో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.పది వేల కోట్లు ఖర్చు పెడితే వైసిపి ప్రభుత్వం రూ.పది కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తామన్నారు. చింతలపూడి ఎంఎల్‌ఎ సొంగా రోషన్‌కుమార్ మాట్లాడుతూ గతంలో కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తుంటే ఆ పొగ వల్ల ఏ ఆడపడుచూ కంట కన్నీరు రాకూడదనే నాటి చంద్రబాబు ఆలోచన దీపం పథకమని చెప్పారు. ప్రతి పేదింటి ఆడబిడ్డ దీపం పథకం గ్యాస్ కనెక్షన్‌తో నాడు కష్టాల నుంచి విముక్తులయ్యారన్నారు. మళ్లీ ఆడపడుచులకు గ్యాస్ సిలిండర్ విషయంలో చేదోడుగా ఉండాలని నిర్ణయించి ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం మహిళలకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఆడపడుచుల కళ్లల్లో ఆనందం కోసం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మూడోది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఆర్‌డిఒ వాణి, నగర పంచాయతీ కమిషనర్ పావని, మాజీ ఎంఎల్‌ఎ ఘంటా మురళీ, దాసరి శేషు, ఎఎంసి మాజీ ఛైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, పెదబాబు, మాటూరి వెంకటరామయ్య, కొండ్రు దేవా, బోడ నాగ భూషణం, బిజెపి జిల్లా నాయకులు విక్రమ్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
