పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

తహశీల్దార్‌ కార్యాలయం వద్ద యుటిఎఫ్‌ నిరసన
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తూ యుపిఎస్‌ వంటి అంకెల గారడి చేసే పెన్షన్‌ స్కీమ్‌ వద్దని, పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని నినదిస్తూ యుటిఎఫ్‌ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద యుటిఎఫ్‌ నాయకులు నిరసన తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ముస్తఫాఆలీ, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ రుద్రాక్షి మాట్లాడుతూ 2024 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 2004 సెప్టెంబర్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేస్తున్నాయన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న పాత పెన్షన్‌ స్కీం ఉద్యోగుల హక్కు అని, బిక్ష కాదని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఖాతారు చేయకుండా సిపిఎస్‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. పాత పెన్షన్‌ కావాలని గత 20 సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటం చేసిన ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. కాని గత ప్రభుత్వం సిపిఎస్‌ స్థానంలో గ్యారంటీ పెన్షన్‌ స్కీం తెచ్చి సిపిఎస్‌ కంటే మెరుగైందని నమ్మబలికిందని, ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ జిపిఎస్‌ను తిరస్కరించారని తెలిపారు. యుపిఎస్‌ను కేంద్ర క్యాబినెట్‌ ఆగస్టు 22న ఆమోదించిందని, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని సూచన చేసిందని చెప్పారు. పాత పెన్షన్‌కి ఎక్కడా పోలిక లేని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు లాభం లేని, కార్పొరేట్ల షేర్‌ మార్కెట్‌కు మాత్రమే లాభాన్ని చేకూర్చే యుపిఎస్‌ను రద్దు చేయాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేస్తుందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్‌ లేని పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.పని సర్దుబాటు ప్రక్రియను సవరించాలని వినతినిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియను సవరించి మండల స్థాయిలోనే అన్ని క్యాడర్ల పని సర్దుబాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద నిరసన తెలిపి ఎడి-1కు వినతిపత్రం అందించారు. ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియను పాఠశాల విద్యాశాఖాధికారులు పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు గందరగోళానికి గురి చేశారని, మండల స్థాయిలో చేయాల్సిన సింపుల్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌ పేరుతో కఠినతరం చేశారన్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్స్‌తో నింపాలనే కారణంతో ఎస్‌జిటిలను ఇష్టారాజ్యంగా బలవంతంగా పని సర్దుబాటు చేశారని, దీంతో కొంతమంది ఉపాధ్యాయులు వందల కిలోమీటర్లు దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో అంఘీకరించిన నిబంధనలను తుంగలో తొక్కారని, డిఇఒ, ఆర్‌జెడి స్థాయి అధికారులను కూడా విశ్వసించకుండా యంత్రాలను నమ్మి ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురి చేశారన్నారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అన్ని స్థాయిల పని సర్దుబాటును సవరించి మండల స్థాయిలోనే అన్ని కేడర్ల పని సర్దుబాటు చేయాలని, అప్పటివరకు ఎలాంటి పని సర్దుబాటు ఉత్తర్వులు విడుదల చేయవద్దని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌పై అధికారులు స్పందించకుంటే రాష్ట్ర సంఘం ఇచ్చే భవిష్యత్‌ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. జిల్లా కోశాధికారి జివి.రంగమోహన్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ బి.మోహన్‌రావు, జిల్లా కార్యదర్శి ఇ.శివశంకరరావు, రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిని, మండల శాఖ నాయకులు కె.కిరణ్‌, షేక్‌ మస్తాన్‌ బి.బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️