మిడ్డే మీల్స్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను నూతన ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్‌ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ (సిఐటియు) జిల్లా విస్తృత సమావేశం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో సంఘం నాయకులు అనురాధ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.రమాదేవి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పరిష్కారించే దిశగా ఆలోచన చేయాలన్నారు. చాలీచాలని జీతాలతో బతుకులు నెట్టుకొస్తున్న మిడ్డే మీల్‌ కార్మికులను ప్రభుత్వం గుర్తించి ప్రమాద బీమా సౌకర్యం, ఇన్సూరెన్స్‌, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వమే గ్యాస్‌ ఇవ్వాలని, మెనూ ఛార్జీలు రూ.20లకు పెంపు చేయాలని, సంవత్సరానికి రెండు జతలు కాటన్‌ చీరలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొన్ని స్కూళ్లలో తొలగించాలని చూస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కొత్త ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందని, ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్‌ పెంచాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యదర్శి ఎం.నాగమణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తున్న ప్రాంతంలో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, అనంతలక్ష్మి, వెంకటలక్ష్మి, అశోక్‌, వెంకటపద్మ, అంజలీదేవి పాల్గొన్నారు.

➡️