గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఎన్నికల కోడ్ తొలగిపోయింది. కోడ్ పేరిట ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన పనులే మిగిలాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రెండు జిల్లాల్లో వేసవి తీవ్రత నేపథ్యంలో తాగు, సాగునీటి సమస్యలు తెరపైకొస్తున్నాయి.పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో అధికార టిడిపి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఫలితాలు వెల్లడయ్యే వరకూ గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా అధికారుల తీరు చర్చనీయాంశమైంది. ప్రధానంగా కౌంటింగ్ ముందు రోజు వరకూ సిబ్బందికి శిక్షణ, అభ్యర్థుల సమావేశాల్లో అంకెలు తప్ప ఎటువంటి రౌండ్లు, గీతలు గీచినా ఓటు చెల్లదని చెప్పిన అధికారులు కౌంటింగ్ ప్రారంభంలో మాటమార్చారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రౌండ్ చేసినా ఇబ్బంది లేదని, రోమన్ అంకెలను సైతం అంగీకరించొచ్చని మౌఖిక ఆదేశాలివ్వడం కౌంటింగ్ ఏజెంట్ల మధ్య వాగ్వివాదానికి దారితీసిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ తరహా మార్పులు కౌంటింగ్ ముందు ఎలా ప్రకటిస్తారనేది సందేహాస్పదమే. ఎన్నికల మాన్యువల్ ప్రకారం కూడా ఇది సరికాదనేది అందరికీ తెలిసిందే. దీనికితోడు కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల కౌంటింగ్ ఒక రీతిగా సాగగా, గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల కౌంటింగ్ మరో రీతిగా సాగింది. దీనివల్ల ఇక్కడి ఎంఎల్‌సి ఎన్నిక ఫలితం రావడానికి 30 గంటలకుపైగా పట్టింది. మరి ఎన్నికల సంఘం వేర్వేరు విధానాల్లో కౌంటింగ్ ఎలా అనుమతిచ్చిందనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇదే కాదు కోడ్ అమలులోనూ అధికార పక్షానికి అనుకూలంగా అధికార యంత్రాంగం వ్యవహరించిందనే విమర్శలు మొదట్లో విన్పించాయి. పోలింగ్ రోజున కూడా ఒరిజినల్ గుర్తింపు పత్రం లేకుండా జిరాక్స్ తీసుకొచ్చినా ఓటింగ్ ఎలా అనుమతించారనేది ఎవరికీ అర్థం కాని విషయంగా మిగిలింది. ఇక పోలింగ్ కేంద్రాల్లోకి ప్రజాప్రతినిధులు గుంపులుగా వెళ్లినా జిల్లా అధికారులు సైతం స్పందించకపోవడం, పోలింగ్ కేంద్రాల వద్దే అధికార పార్టీ వారు ప్రత్యర్థి ఏజెంట్లపై దాడికి తెగబడుతున్నా పోలీసులు చోద్యం చూడటం చర్చనీయాంశమైంది. ఇదే కాదు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఓట్ల నమోదులోనూ అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పిన చోటుకు మండలస్థాయి అధికారులు సైతం వెళ్లి ఓటు ఎలా నమోదు చేయాలో వివరించడంతోపాటు ఓటర్ల నమోదు చేపట్టడంపై నాడే విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల తీరు చూస్తే ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అనేదానికన్నా అధికార యంత్రాంగం తీరే చర్చనీయాంశమైందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం కానుంది. దీనికి వినతులు పెద్దసంఖ్యలో వెల్లువెత్తే అవకాశం ఉంది. ఈలోపుగానే రైతులను సాగునీటి కొరత వెంటాడుతోంది. రెండు జిల్లాల్లోనూ ఆయకట్టు శివారు, కాల్వ శివారు భూములకు సాగునీరందక ఎండిపోతున్న పరిస్థితి పలుచోట్ల ఉంది. సాక్షాత్తూ జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు సొంత జిల్లాలోనే ఆచంట, నరసాపురం తదితర ప్రాంతాల్లో సాగునీటి ఎద్దడి స్పష్టంగా కన్పిస్తోంది. ఏలూరు జిల్లాలోనూ ఈ పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు రంగంలోకి దిగితే తప్ప రైతుల సాగునీటి కష్టాలు గట్టెక్కే అవకాశం కన్పించడం లేదు. ఇక వేసవి ఎండల తీవ్రత మార్చి మొదటి వారంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తాగునీటి విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు దీనిపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీనికి అవసరమైన నిధులు ఇవ్వడంతోపాటు పనులన్నీ సక్రమంగా పూర్తయ్యేలా జిల్లా అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. మరి జిల్లా అధికారులు ఈ వేసవిలో జిల్లావాసుల దాహర్తి ఎలా తీరుస్తారో వేచిచూడాల్సి ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.- విఎస్‌ఎస్‌వి.ప్రసాద్
