మంత్రి పార్థసారధి, ఎంపీ మహేష్‌కుమార్
ప్రజాశక్తి – ముసునూరు
చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణంతోనే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హౌసింగ్, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ముందుగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో డిస్ట్రిబ్యూటీ కమిటీ ఛైౖర్మన్ ఆర్.బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో మంత్రి పార్థసారథి, పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి బాలకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రైతుల విజ్ఞప్తి మేరకు కాట్రేనిపాడు సమీపంలోని ఎన్‌ఎస్‌పి మడిచర్ల మేజర్ పరిధిలోని మైనర్ కాలువను మంత్రి పార్థసారథి, ఎంపీ మహేష్‌తో కలిసి పరిశీలించారు. మైనర్ కాలువను 300 మీటర్ల మేర తవ్వకుండా 30 ఏళ్లు పైగా ఇద్దరు రైతులు అడ్డుకుంటున్నారని, తద్వారా దిగువున తొమ్మిది గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములకు సాగర్ జలాలు సరఫరా జరగకపోవడంతో పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం మంత్రి పార్థసారథి, ఎంపీ మహేష్ కుమార్ స్పందించి రెవెన్యూ, ఎన్‌ఎస్‌పి అధికారులతో మాట్లాడారు. మైనర్ కాలువ తవ్వకానికి అవరోధంగా ఉన్న పరిస్థితులపై సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారంపై తమవంతు కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కనీసం సాగర కాలువల మరమ్మతులను గత వైసిపి ప్రభుత్వం విస్మరించడంతో ముళ్ల పొదలు, తుప్పలు పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిందని పార్థసారధి ఆరోపించారు. సాగర కాలువల మరమ్మతులు చేపట్టేందుకు తక్షణం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడానికి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాట్రేనిపాడు సమీపంలోని మైనర్ కాలువ సమస్య పరిష్కారానికి ఎంపీతో కలిసి తన వంతు కృషి చేస్తానని పార్థసారధి రైతులకు హామీ ఇచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ విషయంలో గత వైసిపి ప్రభుత్వం వ్యవహరించిన తీరును మంత్రి పార్థసారథి తప్పు పట్టారు. ఈ పథకం నిర్మాణం పూర్తి చేయడం ద్వారా సాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం ఎంపీ పుట్టా మహేష్ మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం విషయంలో గత వైసిపి ప్రభుత్వం వ్యవహరించిన నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం సాగునీటి కోసం రైతులు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసినందుకు సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన మరుక్షణం చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అనంతరం వెలుగు శాలల్లో జరిగిన అంకమ్మ తల్లి ఆలయం ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌పి ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ కోటా వీరబాబు, నాయకులు దేవినేని దళారం, అట్లూరి రమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
