నూజివీడులో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించాలి

సిపిఎం పట్టణ మహాసభ డిమాండ్‌
ప్రజాశక్తి – నూజివీడు టౌన్‌
పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను తక్షణం పరిష్కరించాలని సిపిఎం పట్టణ ఆరో మహాసభ డిమాండ్‌ చేసింది. మహాసభ స్థానిక శ్రీ శక్తి భవన్‌లో ఆదివారం జరిగింది. ముఖ్య వక్త సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.లింగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, అన్ని తరగతుల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు, పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని విమర్శించారు. రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేయాలని చూస్తున్నారని, కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలపై అధిక భారాలు వేయడం తప్ప ఈ కాలంలో చేసిందేమీ లేదని, ధరలు అరికట్టడంలో విఫలమైందని అన్నారు. ఇప్పటికీ ఉచిత ఇసుక అందని ద్రాక్షగానే మిగిలిందన్నారు. పట్టణ కార్యదర్శి ఎన్‌ఆర్‌.హనుమాన్‌ కార్యకలాపాల నివేదికను ప్రవేశ పెట్టగా ప్రతినిధులు చర్చించి ఆమోదించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రాజు, జిల్లా కమిటీ సభ్యులు జివిఎల్‌.నరసింహారావు మాట్లాడుతూ రానున్న కాలంలో పట్టణంలో సమస్యలపై ప్రజలను చైతన్యపర్చి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పనులు పట్టణంలో కూడా చూపాలని, ప్రయివేటు సంస్థల్లో కనీస వేతనాలు అమలు చేయాలని, విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ మహాసభలో తీర్మానాలు ఆమోదించారు.

➡️