టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి
ప్రజా చైతన్య సైకిల్‌ యాత్ర ప్రారంభం
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
నగరంలో అసంపూర్తిగా ఉన్న దాదాపు 17 వేల టిడ్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్‌ చేశారు. పది సంవత్సరాలుగా టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయయని, ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప లబ్ధిదారులకు ఇళ్లు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆ పార్టీ బృందం శనివారం కొత్తూరులోని అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని పది సంవత్సరాల క్రితం ప్రజల వద్ద నుండి రూ.కోట్లు వసూలు చేశారని, బ్యాంకు రుణాల నిమిత్తం ఒప్పందాలు కూడా చేశారని, అయితే నేటికీ ఏఒక్కరికీ ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదని తెలిపారు. మరోపక్క బ్యాంక్‌ అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్న లబ్ధిదారులకు వడ్డీలు కట్టాలని నోటీసులు పంపిస్తూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులకు అటు ఇళ్లు కేటాయించక, ఇటు వడ్డీలు కట్టుకోలేక, అద్దె ఇళ్లలో అద్దె కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. రూ.వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోమైందని, ఇది చాలా బాధ్యతారాహిత్యమని, ప్రభుత్వం ఇప్పటికైనా సరే వెంటనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను, వృధాగా పడి ఉన్న మెటీరియల్‌ను సిపిఎం బృందం పరిశీలించింది. ఏప్రిల్‌ నెలాఖరులోగా టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించని పక్షంలో ఇళ్ల స్వాధీన ఉద్యమం చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఎం నగర కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ ఏలూరు నగరంలో వేలాది మంది పేదలు సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో కాపురం ఉంటున్నారన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ నిమిత్తం డబ్బులు కూడా చెల్లించి అద్దె చెల్లించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. తెలుగుదేశం కూటమి ఎన్నికలకు ముందు టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పిందని, తొమ్మిది మాసాలు గడుస్తున్నా సరే ఇళ్ల నిర్మాణం పనులు అలాగే ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కె.శ్రీనివాస్‌, కె.విజయలక్ష్మి, కె.లెనిన్‌, నగర నాయకులు వైఎస్‌.కనకారావు, ఎం.ఇస్సాక్‌, బి.సోమయ్య, ఎం.సత్యనారాయణ, పి.ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. నూజివీడు టౌన్‌: పట్టణ పరిధిలోని డాక్టర్‌ ఎంఆర్‌.అప్పారావు కాలనీలోని టిడ్కో ఇళ్లను సిపిఎం పట్టణ బృందం శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రాజు, పట్టణ కార్యదర్శి ఎన్‌ఆర్‌.హనుమాన్లు, నేత ఎన్‌.పద్మాంజలి మాట్లాడుతూ పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని పాలకులు మాట ఇచ్చి 11 ఏళ్లు దాటిందన్నారు. 2014లో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని, ఇప్పటికీ పూర్తి చేయలేదని అన్నారు. గత వైసిపి పాలకులు వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటివరకు పేదలకు ఇస్తామన్నా ఇంటి విషయంలో నోరు మెదపడం లేదన్నారు. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందనే నమ్మకంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు లక్షలాది రూపాయలు డిపాజిట్లుగా కట్టారన్నారు. లబ్ధిదారులకు అందించే ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. పాలకులు స్పందించకపోతే లబ్ధిదారులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️