ఏప్రిల్‌ 30లోగా టిడ్కో ఇళ్లు ఇవ్వాలి

లేకుంటే పోరాటం తప్పదు
ప్రజా చైతన్య యాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం
లబ్ధిదారులకు ఏప్రిల్‌ 30వ తేదీలోగా టిడ్కో ఇళ్ల అప్పగించాలి, ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుంటే మే 30వ తేదీ నాటికి లబ్ధిదారులందరినీ ఐక్యం చేసి ఇళ్లు స్వాధీనం చేసేందుకు పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఎం జంగారెడ్డిగూడెం పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్ర ఆదివారం జంగారెడ్డిగూడెంలోని మార్కండేయపురంలో సాగింది. ఈ కార్యక్రమం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రవి టిడ్కో ఇళ్లు కట్టిన ఏరియాలో పర్యటించి ప్రభుత్వం వాటిని కట్టిన విధానాన్ని అలాగే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చిన ఇనుము, సిమెంటు ఇసుక, మెటల్‌, వాటర్‌ గొట్టాలు తదితర పాడైన మెటీరియల్‌ను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రవి మాట్లాడుతూ టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించకపోవడం ప్రజల పట్ల ప్రభుత్వాల చిన్న చూపే అని విమర్శించారు. సుమారు 864 కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో 2017 సంవత్సరంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల నుండి 25 వేల రూపాయల నుండి లక్షల రూపాయలు ప్రభుత్వం సేకరించి కోట్ల రూపాయలు టిడిపి ప్రభుత్వం దోచుకుందని తెలిపారు. వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల నిర్మాణం చేపట్టింది కానీ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకుండా 2019 ఎన్నికల్లో ఓట్లు వేస్తేనే ఈ ఇళ్లు ఇస్తామని వాగ్దానం చేసిందని ఎన్నికల్లో ఓడిపోయి అవమానాలపాలైందన్నారు. తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అప్పగించడంలో విఫలమైందని విమర్శించారు. మరలా తిరిగి ప్రజలకు సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తానని మాయ మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పజెప్పలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఆయా లబ్ధిదారులకు ఏప్రిల్‌ నెలాఖరులోగా ఇళ్లు అప్పగించాలని, లేనిపక్షంలో మే నెలాఖరుకు సిపిఎం ఆధ్వర్యంలో బాధితులను ఐక్యం చేసి ఇళ్లను స్వాధీన పరుస్తామని ఆయన మున్సిపాల్టీ అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్వించారు. మాటలకు పరిమితమవుతున్న పాలకులు, స్థానిక నాయకులు, మున్సిపాలిటీ అధికారులు కనీసం తాగునీరు, విద్యుత్‌, రోడ్ల సమస్యలను పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. స్థానిక ఎంఎల్‌ఎ పర్యటనలో లబ్ధిదారులు వారి సమస్యలు విన్నవించుకున్నప్పటికీ, ఎంఎల్‌ఎ హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బాధితులు వాపోయారని తెలిపారు. తక్షణం మార్కండేయపురం కాలనీలో సమస్యలు పరిష్కరించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జి.సూర్యకిరణ్‌, ఎ.ప్రభాకరరావు, వై.సీత, టౌన్‌ కన్వీనర్‌ పసల సూర్యారావు, ఎస్‌ఎ.సుభాషిని, వంగ గోపి, ఎస్‌కె.మాబు సుభాని, కె.సుబ్బారావు, పి.సుబ్బారావు, బి.యశ్వంత్‌ పాల్గొన్నారు.

➡️