రెండు జిల్లాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి మెండుగా అవకాశాలు
ప్రభుత్వాలు మాటల్లో తప్ప.. చేతల్లో ముందుకు సాగని పరిస్థితి
కొల్లేరు, గుంటుపల్లి బౌద్ధ గుహల పరిస్థితి ఏంటి?
పేరుపాలెం బీచ్ అభివృద్ధికి చర్యలు అంతంతమాత్రమే
గోదావరి, సముద్ర తీరంలో రిస్టార్ట్స్ అభివృద్ధిలోనూ నిర్లక్ష్యమే
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రభుత్వం మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపించాలంటూ జిల్లా ప్రజానీకం కోరుకుంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగం అభివృద్ధి గురించి పదేపదే చెబుతున్న పరిస్థితి ఉంది. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ పర్యాటక రంగ అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు. దీంతో జిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై జనాల్లో చర్చ కొనసాగుతోంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నడుమ ఉన్న కొల్లేరు సరస్సు 77 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద తాగునీటి సరస్సు కొల్లేరు. ఇక్కడికి ఏటా వందల సంఖ్యలో విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. ఆటపాకలో ప్రత్యేకంగా పక్షుల కేంద్రం, గుడివాకలంకలో రిస్టార్ట్ ఉన్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పర్యాటక ప్రాంతంగా కొల్లేరుకు మంచి గుర్తింపు ఉంది. బోట్ షికారు వంటివి ఏర్పాటు చేసి, రిస్టార్ట్స్ నిర్మించి సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకంగా కొల్లేరు ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక్కడి ప్రజలకు సైతం పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొల్లేరు పర్యాటక అభివృద్ధిపై సమావేశాలు నిర్వహించడం తప్ప ఒక్క అడుగు ముందుకు పడిన పరిస్థితి లేకుండా పోయింది. కామవరపుకోట గుంటుపల్లి బౌద్ధగుహలకు గొప్ప చరిత్ర ఉంది. అక్కడ వసతులు కల్పిస్తే పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితి కొనసాగుతోంది. పోలవరం నుంచి కుక్కునూరు వరకూ గోదావరి తీర ప్రాంతాల్లో రిస్టార్ట్స్ ఏర్పాటు చేస్తే పెద్దఎత్తున పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కొల్లేరు పెద్దింట్ల గుడికి అనేక జిల్లా నుంచి పెద్దఎత్తున జనం వస్తుంటారు. అక్కడ సరైన వసతులు లేని పరిస్థితి నెలకొంది. సరైన రవాణా సదుపాయం సైతం లేకుండా పోయింది. ఇలాంటి ప్రాంతాలను గుర్తించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం పెరగడంతో పాటు, ఎంతో మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది.సముద్ర, గోదావరి తీరాల్లో పర్యాటక అభివృద్ధి ఏదీ?విభజిత పశ్చిమగోదావరి జిల్లాలో సముద్ర, గోదావరి తీరం కిలోమీటర్ల మేర ఉంది. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కి ఏటా కార్తీక మాసంతోపాటు, ఇతర సెలవు దినాల్లోనూ పెద్దఎత్తున పర్యాటకులు వెళ్తుంటారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ సరైన సదుపాయాలు లేకుండా పోయాయి. పెద్దఎత్తున రిస్టార్స్ నిర్మించి పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉన్నా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. దొంగరావిపాలెం రిసార్ట్స్ వంటివి కొన్ని మాత్రమే ఉన్నాయి. తీరప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయి. పెద్దమల్లంలో రిసార్ట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పూర్తయినా ఇప్పటికీ ముందుకు సాగని పరిస్థితి. మోళ్లపర్రులోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇవి కాకుండా ఏజెన్సీ ప్రాంతం బుట్టాయగూడెం మండలంలోని దొరమామిడి వద్ద గుబ్బాల మంగమ్మ గుడి ప్రాంతం, పశ్చిమలోని భీమవరం, పాలకొల్లులో ఉన్న పంచరామ క్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ప్రభుత్వాలు మాత్రం మాటలకే.. తప్ప చేతల్లో మాత్రం ముందుకు సాగడం లేదు. కూటమి ప్రభుత్వమైనా జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి పరుగులు పెట్టించాలని అంతా కోరుతున్నారు.