దెందులూరు: స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులకు సమాజసేవలో భాగస్వామ్యం కల్పించి, ఉన్నత విలువలు పెంపొందించవచ్చని స్కౌట్ కార్యదర్శి ఐ.భాస్కర్ అన్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని పియంశ్రీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు స్కౌట్స్ మాస్టర్, గైడ్స్ కెప్టెన్‌లుగా పనిచేయడానికి ఏడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏలూరు సమీపంలోని వేగవరంలో హేలాపురి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా స్కౌట్ కార్యదర్శి ఐ.భాస్కర్ మాట్లాడుతూ స్కౌట్స్, గైడ్స్ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, స్వీయ అభివృద్ధి, సమాజసేవ వంటి మంచి లక్షణాలు అలవడి పరిపూర్ణ, మానసిక పరివర్తన తీసుకురావచ్చని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు ప్రథమ చికిత్స, వివిధ ముడులు, టెంట్ కట్టుకునే విధానం, వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వటం జరిగింది.