పోలీసు శాఖలో బదిలీల బెంగ..!

ఎస్‌ఐల బదిలీల్లో చెల్లని ఎంఎల్‌ఎల సిఫార్సు లేఖలు
అమరావతి ఆదేశాలతోనే ఎస్‌ఐ, సిఐల బదిలీలు
వైసిపి హయాంలో టిడిపి నేతలపై కేసు పెడితే పోస్టింగ్‌ కష్టం
ఐదేళ్లు ఒకేచోట పని చేసిన సిబ్బంది బదిలీలపై స్పష్టత కరువు
జీరో సర్వీస్‌ రిక్వెస్ట్‌ బదిలీలపై మౌనం
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
పోలీస్‌శాఖలో సిఐ, ఎస్‌ఐల బదిలీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు జిల్లాల్లో ఇటీవల కాలంలో పెద్దఎత్తున సిఐ, ఎస్‌ఐల బదిలీలు జరిగాయి. బదిలీలకు సంబంధించి మరో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలామంది అధికారులు ఎంఎల్‌ఎల సిఫార్సు లేఖలు తీసుకుని తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా చుక్కెదురైనట్లు తెలుస్తోంది. బదిలీల ప్రక్రియ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయంతో కాకుండా అమరావతి నుంచి వచ్చే ఆదేశాలతో జరుగుతుందని చెబుతున్నారు. జిల్లా అధికారులు బదిలీల జాబితా తయారు చేసి అమరావతికి పంపిన తర్వాత అక్కడ నుంచి వచ్చే అదేశాలకు అనుగుణంగా సిఐ, ఎస్‌ఐలను బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీల కోసం అమరావతిలో ప్రత్యేకంగా ఒక టీమ్‌ పని చేస్తున్నట్లు చెబుతున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో వైసిపి నాయకులను అనుకూలంగా వ్యవహరించిన, ఏదైనా కారణంతో అప్పట్లో టిడిపి నాయకులపై కేసు నమోదు చేసిన అధికారులకు పోస్టింగ్‌ ఇవ్వకుండా నిలుపుదల చేస్తున్నారు. కొంతమందిని పక్కన పెడుతున్న పరిస్థితి కన్పిస్తోంది. పశ్చిమ, ఏలూరు జిల్లాలో ఈ విధంగా పలువురి ఎస్‌ఐలకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టిన పరిస్థితి ఉందని తెలుస్తోంది. పోస్టింగ్‌ ఇవ్వకుండా ఆపిన అధికారుల గురించి ఎంఎల్‌ఎలు నేరుగా పైస్థాయిలో మాట్లాడినా పట్టించుకోవడం లేదని సమాచారం. దీంతో ఎంఎల్‌ఎలు సైతం ఏమి చేయలేక చేతులెత్తేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఎల్‌ఎలు సిఫార్సులు లేఖలు ఇచ్చినప్పటికీ అధికారులను సైతం పక్కన పెట్టడం పోలీస్‌శాఖలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కిందిస్థాయి అధికారులు పని చేస్తారు. కొంతమంది ఎస్‌ఐ, సిఐలపై కక్షగట్టి పోస్టింగ్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం పోలీస్‌ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. గత వైసిపి ప్రభుత్వం ఇదేవిధంగా చేసిందని కొత్త ప్రభుత్వం వచ్చాక ఇటువంటివి కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు చేయని కొంతమంది అధికారులను కూడా వైసిపి అనుకూల జాబితాలో చేర్చి పోస్టింగ్‌ ఇవ్వడం లేదనే అభిప్రాయం పోలీస్‌శాఖలో వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి వదిలి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది. పోలీస్‌ శాఖాధికారుల బదిలీల్లోనూ పెద్దఎత్తున రూ.లక్షల్లో మామూళ్లు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పోలీస్‌ సిబ్బంది బదిలీలపై స్పష్టత ఏది..? పోలీస్‌శాఖలో బదిలీలపై సర్వత్రా చర్చ సాగుతోంది. 15 శాఖల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పోలీస్‌ శాఖలోని సిబ్బంది బదిలీలకు సంబంధించి మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని, అనారోగ్య సమస్యలు, కుటుంబంలోని ఇబ్బందుల నేపథ్యంలో ఎంతోమంది పోలీస్‌ సిబ్బంది రిక్వెస్ట్‌ బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. పోలీస్‌శాఖలో సిబ్బందికి సంబంధించి బదిలీ ఆదేశాలు ఎందుకు ఇవ్వలేదనే చర్చ నడుస్తోంది. రెండు జిల్లాల్లో దాదాపు మూడు వేల మంది వరకూ పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. దాదాపు 60 వరకూ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్‌లోనూ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సిబ్బంది నలుగురైదుగురు ఉన్న పరిస్థితి. అంతేకాకుండా జీరో సర్వీస్‌ బదిలీల కోసం ఎదురుచూస్తున్న సిబ్బంది చాలామంది ఉన్నారు. పోలీస్‌ శాఖలోని సిబ్బంది బదిలీలపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో ఏఒక్కరికీ అర్థం కావడం లేదు. పోలీస్‌ సిబ్బంది బదిలీలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇచ్చి ప్రక్రియ చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు.

➡️