మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
చంద్రబాబు తణుకు పర్యటనతో నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులోని వైసిపి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నగర పర్యటన చేయడం సంతోషమే కానీ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను చివరి నుంచి మూడో స్థానంలో నిలపడం ఎంతో బాధాకరమన్నారు. నగరంలో ఎక్కడా కూడా చెత్త సేకరణ జరగటం లేదన్నారు. తణుకు ఎంఎల్‌ఎ కోట్లాది రూపాయలను వెనకేసుకుంటున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలు ప్రయివేట్ పరం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైసిపి ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి జయప్రకాష్, నూకపెయి సుధీర్, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
