ఆరు గ్రామ పంచాయతీలు తీర్మానం
ప్రజాశక్తి – ఉంగుటూరు
ప్రస్తుతం ఉంగుటూరులోని టోల్‌గేటును నాచుగుంట-వెల్లమిల్లి దారి వద్దకు మార్చాలని కాగుపాడు, దొంతవరం, ఉంగుటూరు, విఎపురం, కాకర్లమూడి తదితర ఆరు పంచాయతీలు తీర్మానాలు చేశాయి. ఆ తీర్మానాలను టోల్‌ప్లాజ్ నిర్వాహకులకు అందజేసినా తీసుకోలేదని కూటమి నాయకులు విమర్శించారు. ఈ మేరకు సోమవారం టిడిపి మండలాధ్యక్షుడు పాతూరి విజయకుమార్ అధ్యక్షతన తీర్మానాలు చేసిన గ్రామాల సర్పంచులు, కూటమి నాయకులు సమావేశమయ్యారు. టిడిపి నాయకుడు కడియాల రవిశంకర్ మాట్లాడుతూ ఇప్పుడున్న టోల్‌గేటును నాచుగుంట వద్దకు మార్చేందుకు గతంలోనే భూసేకరణ చేసి సంబంధిత భూయజమానులకు హైవే అథారిటీ పరిహారం కూడా ఇచ్చేశారన్నారు. అయితే నాచుగుంట వద్ద టోల్‌ప్లాజా నిర్మించకుండా ఏలూరు కాలువ గట్టు ఆక్రమించి ఉంగుటూరులోనే కొనసాగించడం వల్ల తమ గ్రామాల రహదారులు భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టోల్ పన్ను నుంచి తప్పించుకునేందుకు భారీ వాహనాలు సైతం ఉంగుటూరు, కొత్తగూడెం, నాచుగుంట గ్రామాల్లోంచి రాకపోకలు సాగించడంతో కోట్లాది రూపాయలతో నిర్మించిన రహదారులు గోతులతో పాడైపోతున్నాయని, స్థానికులు సైతం నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని ఉంగుటూరు సర్పంచి బండారు సింధు అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి ఎలాంటి పరిహారమూ ఇవ్వకుండా వ్యాపారం చేసుకుంటున్న టోల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాతూరి విజయకుమార్ మాట్లాడుతూ 2015లో ఉంగుటూరు టోల్‌గేటు వస్తుందంటే తామంతా అప్పట్లో సహకరించామని, ఇక్కడి నిర్వాహకులు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ స్థానికులకు పాస్‌లు ఇవ్వడం లేదని ఆరోపించారు. మరుగుదొడ్ల నీరు పంట బోదెల్లోకి వదిలేయడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నామని నాచుగుంటకు చెందిన చిట్టూరి హరిబాబు అన్నారు. టోల్‌గేటు మార్చకపోతే నెల రోజుల తరువాత కార్యాచరణ ప్రణాళిక అమలు చేసి హైవేను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఇమ్మణి గంగాధరరావు, సింగులూరి ధర్మారావు, పొట్ల ఏడుకొండలు, శీరెడ్డి నరశింహరావు, కంభంపాటి పెద్దిరాజు పాల్గొన్నారు.
