యుటిఎఫ్, సిఐటియు నేతలు
ప్రజాశక్తి – కుక్కునూరు
ఈ నెల 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేషన్ ఎంఎల్‌సి ఎన్నికల్లో వీరరాఘవులుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కమల్‌కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల సంయుక్త సమావేశం సుందరయ్య భవనంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో సుజాత అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్‌కుమార్, సాయికిరణ్ మాట్లాడుతూ నేడు పాలకుల వైఖరి వల్ల ప్రజల జీవితాలు కష్టాల పాలవుతున్నాయన్నారు. ఉపాధి దొరకడమే గగనమైపోతుందన్నారు. చదువుకున్న యువత సైతం చాలీచాలని జీతాలకు పని చేస్తున్నారన్నారు. పాలకులు మాత్రం కార్పొరేట్ శక్తుల ప్రాపకం కోసం ప్రజల జీవితాలను పణం పెట్టేవారికి అనుకూలమైన చట్టాలు చేస్తున్నారన్నారు. ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తున్నారన్నారు. పాలకుల విధానాలను ప్రశ్నించేందుకు సరైన వేదికలు చట్ట సభలే. ఆ చట్ట సభల్లో ప్రజల సమస్యలు లేవనెత్తి పరిష్కారించేవారినే మనం గెలిపించుకోవాలన్నారు. మనందరి తరఫున నికరంగా నిలబడినవారు పిడిఎఫ్ ఎంఎల్‌సిలేనన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిడ్ల వీరరాఘవులును గెలిపించాలన్నారు. పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు బలపరుస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షలు యర్రంశెట్టి నాగేంద్రరావు, యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బానారి బాలకృష్ణ, సిఐటియు మండల ఉపాధ్యక్షులు షేక్ వలీపాషా, సహాయ కార్యదర్శి కాకర్ల శ్రీను, యుటిఎఫ్ మండలాధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు కాసిం బి పాల్గొన్నారు.
