ఎంపిడిఒ కార్యాలయాన్ని ముట్టడిస్తాం

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జీవరత్నం
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌
ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఎంపిడిఒ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం, మండల కార్యదర్శి అందుగుల ప్రభాకరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు ఎంపిడిఒ కెవి.ప్రసాద్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.జీవరత్నం మాట్లాడుతూ మండలంలోని ఉపాధి హామీ కూలీలకు గత 60 రోజుల నుంచి పనులు చేస్తున్నా పే స్లిప్పులు ఇవ్వకపోవడానికి తీవ్రంగా ఖండించారు. ఎ.పోలవరం, తాడువాయి, వేగవరం గ్రామాల్లో ఉపాధి పని చేసే చెరువుల్లో యంత్రాలతో రాత్రులు మట్టి తోలకాలు తోలుతున్నారని పలుమార్లు మండల ఎపిఒకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ చర్యలు తీసుకోలేదని చెప్పారు. వేతన బకాయిలు అందక ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామాల్లో పని కావాలని అడుగుతున్న కూలీలకు పని కల్పించడం లేదని వాపోయారు. కూలీలు జాబ్‌ కార్డులు కావాలని దరఖాస్తు పెట్టి నెలల తరబడి అడుగుతున్నప్పటికీ కంప్యూటర్లు పనిచేయటం లేదనే పేరుతో కూలీలకు జాబుకార్డులు ఇవ్వడంలేదన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు పేస్లిప్పులు ఇవ్వాలని, ఉపాధి పని చేస్తున్న చెరువుల్లో యంత్రాలతో మట్టి తోలుతున్న భూస్వాములపై, వారికి సహకరిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని, అడిగిన వారందరికీ జాబు కార్డులు ఇచ్చి వెంటనే వేతన బకాయిలు విడుదల చేయాలని, అడిగిన వారందరికీ పనులు కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే మండలంలోని ఉపాధి హామీ కూలీలందరినీ ఐక్యం చేసి ఎంపిడిఒ కార్యాలయం ముట్టడిస్తామని ఆయన ఉపాధి హామీ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జోడే సూర్యచంద్రరావు, యాగంటి సీతా, వామిశెట్టి నరసరావు, పిల్లి చంటి పాల్గొన్నారు.

➡️