ఎస్‌పి ప్రతాప్ శివ కిషోర్
ఏలూరు స్పోర్ట్స్ : మృతిచెందిన సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని జిల్లా ఎస్‌పి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఏలూరు రూరల్ పరిధిలోని పాలగూడెం ప్రాంతానికి చెందిన జి.రాంబాబు దెందులూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్య కారణాలతో విజయవాడలోని ఒక ప్రయివేటు ఆసుత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి విజయవాడలో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సందర్శనార్థం ఏలూరు రూరల్ పరిధిలోని పాలగూడెం ప్రాంతానికి చేర్చారు. ఏలూరు జిల్లా ఎస్‌పి ప్రతాప్ శివ కిషోర్ సిబ్బందితో కలిసి పాలగూడెం ప్రాంతానికి వెళ్లి అక్కడ రాంబాబు మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారిని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ మీకు ఏ సహాయ సహాయం కావాలన్నా వెంటనే తనని సంప్రదించాలని సూచించారు. మృతిచెందిన కుటుంబ సభ్యులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి అడ్మిన్ నక్క సూర్యచంద్రరావు, ఏలూరు డిఎస్‌పి శ్రావణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.