ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం ఆధ్వర్యాన మహిళా సాంస్కృతిక సమ్మేళనం
వివిధ రంగాల్లో సేవలందిస్తున్న 20 మందికి అభినందన సత్కారాలు
ప్రజాశక్తి – ఏలూరు
మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారని పలువురు వక్తలు అన్నారు. 1917లో పెట్రోగ్రాడ్ మహిళల ఉద్యమం ప్రేరణతో 1975లో ఐక్యరాజ్యసమితి ప్రకటనతో అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహస్తున్నట్లు తెలిపారు. ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం సంయుక్తంగా సాహిత్యంలో మహిళా సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించాయి. ఈ సందర్భంగా మహిళలకు బెస్ట్ఫ్రం వేస్ట్, పేపర్ క్రాఫ్ట్స్, తెలుగు సామెతలు, అంతర్జాలంలో అన్వేషణ అభ్యుదయ మహిళా గీతాలు పోటీలు నిర్వహించగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి అంశంలోనూ బెస్ట్ త్రీ చొప్పున విజేతలకు పెద్దల చేతులమీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సుకు నిర్వాహక కమిటీ సభ్యురాలు టీచర్ జి.నీలిమ స్వాగతం పలికారు. రిటైర్డ్ హెడ్‌మాస్టర్ జి.కస్తూరిబారు అధ్యక్షత వహించారు. రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.ఎస్తేరు కళ్యాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒకరోజు మహిళా దినోత్సవం గురించి చెప్పుకుని సరి పెట్టడం కాకుండా మహిళా సమస్యలపై నిరంతరం చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ డిఎన్‌ఎస్.చంద్రావతి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన శస్త్రసాంకేతిక రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. హేలాపురి బాలోత్సవం ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళలందరూ తమ శక్తిని అర్థం చేసుకొని అవకాశాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ మహిళలు నిరంతరం ఐక్యం కావాలన్నారు. హెడ్‌మాస్టర్ దేవరకొండ సుశీల మాట్లాడుతూ 1975 నుంచి ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి మహిళా దినోత్సవం ప్రకటిస్తోందని, వాటి వివరాలు తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిలో కమిటీ గుర్తించిన 20 మందికి అభినందన సత్కారాలు చేశారు. సత్కారాలు స్వీకరించిన వారిలో ప్రయివేట్, ప్రభుత్వ స్కూల్స్ టీచర్లు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. నిర్వాహక కమిటీ సభ్యులకు, న్యాయ నిర్ణేతలకు మహిళా దినోత్సవ సాహిత్యం రాజ్యాంగ సంకలనం పుస్తకాలు, కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్రబుక్స్, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో టీచర్ ఎం.సుకన్య, మానవత ఏలూరు మండల కార్యదర్శి వి.సాయిసుధ, రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ వై.నిర్మల, ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు కె.శ్రీనివాసరావు, కె.శ్రావణి కుమారి, కె.జనని, నెరసు నాగమణి పాల్గొన్నారు.
