నూజివీడు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
మంత్రి కొలుసు పార్థసారధి
ప్రజాశక్తి – ముసునూరు
నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరుగా పని చేస్తానని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. శనివారం ముసునూరు మండలం గోపవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. గతంలో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా పనికిరాని స్థితిలో ఉండటంతో అదే గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కె.శివ రూ.60 వేల ఆర్థిక సాయంతో మరమ్మతులు చేపట్టారు. ఈ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి పార్థసారధి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో వేలకోట్లు ఖర్చు చేస్తుందన్నారు. దీన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాను ఈ నియోజకవర్గానికి పెద్ద పాలేరులా పని చేస్తానని, ఏ కష్టమొచ్చినా తన దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని రోడ్ల పనులు త్వరలో చేపడతామన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికీ రూ.4.30 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, నేతలు పాల్గొన్నారు. బలివే గ్రామంలో శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద తమ్మిలేరుపై వంతెన నిర్మాణ పనులు పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నూజివీడు ఆర్‌డిఒ వై.భవానిశంకరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
