జిల్లా పరిషత్‌ వాడీవేడి

ఉమ్మడి జెడ్‌పి సర్వసభ్య సమావేశంలో సమస్యలపై ఎంఎల్‌ఎల నిలదీత
తమ ప్రాంత సమస్యలపై ఏకరువు పెట్టిన స్థానిక ప్రజాప్రతినిధులు
వ్యవసాయం, వైద్యం, విద్య శాఖలపై ప్రశ్నల వర్షం
జెడ్‌పి ఛైర్‌పర్సన్‌పై ‘చింతమనేని’ ఆగ్రహం
తూర్పుగోదావరి ఉన్నతాధికారులు రాకపోవడంపై నేతల అసహనం
రైతాంగానికి అండగా ఉంటాం: మంత్రి నిమ్మల
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడీగా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి సర్వసభ్య సమావేశంలో ఎంఎల్‌ఎలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ అధ్యక్షతన శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్‌తోపాటు ఎంఎల్‌ఎలు బడేటి చంటి, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్‌కుమార్‌, ఆరిమిల్లి రాధాకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజు, చింతమనేని ప్రభాకర్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి, పశ్చిమ జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి, డిఎఫ్‌ఒ రవీంద్ర దామా, జెడ్‌పి సిఇఒ డి.సుబ్బారావుతోపాటు జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అజెండాలో భాగంగా తొలుత వ్యవసాయశాఖపై చర్చలో ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గడిచిన జులైలో వచ్చిన వరదలకు యనమదుర్రు డ్రెయిన్‌ కింద పంట పొలాలన్నీ ముంపునకు గురయ్యాయన్నారు. వయ్యేరు కాలువ పూడికతీత వంటి కార్యక్రమాలను ఐదేళ్లుగా నిర్లక్ష్యం వహించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ఆ పనులు పూర్తి చేయాలన్నారు. గత పాలకులు ధాన్యం కొనుగోలును అస్తవ్యస్తంగా మార్చేశారన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులు ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఇబ్బంది పడ్డారని, ధాన్యం కొనుగోలుపై నూతన విధానాన్ని తీసుకొచ్చి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వాడ కాలువ పనులు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. గోదావరి పక్కనే ఉన్నా బోరు నీళ్లు తాగాల్సిన దుస్థితి ఉందన్నారు. దీంతో కిడ్నీ, లివర్‌, మోకాళ్ల నొప్పుల సమస్యలు వస్తున్నాయన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కౌలుకార్డులు ఇచ్చి సాఫీగా బ్యాంకుల రుణాలు అందించాలన్నారు. జలజీవన్‌ మిషన్‌లో తాగునీరు అందించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు నిల్‌ వైద్యఆరోగ్యశాఖ సమీక్షలో భాగంగా ఎంఎల్‌ఎలు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి ఆసుపత్రుల్లో బెడ్‌షీట్స్‌ నుంచి పరీక్షల వరకూ అనేక సమస్యలను ఎంఎల్‌ఎ సొంగా రోషన్‌కుమార్‌ లేవనెత్తారు. తణుకు జిల్లా ఆసుపత్రిలో సమస్యలపై ఆరిమిల్లి, కొవ్వూరు ఆసుపత్రిలో సమస్యలపై ముప్పిడి, దెందులూరు ఆసుపత్రిలోని సమస్యలపై చింతమనేని ప్రభాకర్‌, గోపాలపురం ఎంఎల్‌ఎ మద్దిపాటి వెంకట్రాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్‌టెక్నిషియన్‌ లేరంటూ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించడంతో అధికారులను ఉక్కిరిబిక్కిరయ్యారు. నిడదవోలు ఆసుపత్రిలో పడకల పెంపునకు సంబంధించి అనుమతులు, సాగిన ప్రక్రియపై మంత్రి కందుల దుర్గేష్‌ సైతం అసహనం వ్యక్తంచేశారు. విద్యాశాఖపై చర్చలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నాడు-నేడు పనులు ఎక్కడా పూర్తికాలేదని ధ్వజమెత్తారు. ఆర్‌అండ్‌బి, గృహనిర్మాణం వంటి ఇతర శాఖలపై చర్చల్లో ప్రజాప్రతినిధులు పలు సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులు సమావేశానికి రాకపోవడంపై నేతలు అసహనం వ్యక్తం చేశారు.రైతాంగానికి అండగా ఉంటాం: మంత్రి నిమ్మల మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాపై సిఎంకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. జిల్లాలో 80 శాతం ప్రజలు వ్యవసాయంపైనే అధారపడి జీవిస్తున్నారన్నారు. రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం రాగా డ్రెయిన్లు, కాల్వల్లో తూడు, గుర్రపు డెక్క యుద్ధప్రాతిపదికన తొలగించిందన్నారు. భూయజమానితో సంబంధం లేకుండా విఆర్‌ఒ సంతకంతో కౌలుకార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇ-క్రాఫ్‌లో కౌలురైతుల పేర్లు నమోదు చేయపోవడంతో ప్రభుత్వ సాయం అందడం లేదన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెస్తామన్నారు. రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. జెడ్‌పి ఏడుస్థాయీ సంఘాలు నూతన ఎంపీలు, ఎంఎల్‌ఎలతో కొత్తగా ఏర్పాటు చేశారు.ఎజెండా పుస్తకాలపై మారని తీరు గతంలో ఎజెండాలోని అంశాలతోపాటు జిల్లాలోని ఇతర శాఖలకు సంబంధించిన సమాచారంతో పుస్తకాలు ముద్రించి ప్రజాప్రతినిధులకు, మీడియాకు అందించేవారు. గత ప్రభుత్వ పాలనలో దీనికి తిలోదకాలు ఇచ్చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సైతం అధికారుల తీరులో మార్పు రాలేదు. ఎంఎల్‌ఎలకు తప్ప ఎజెండా పుస్తకాలు ఏఒక్కరికీ ఇవ్వలేదు.జెడ్‌పి ఛైర్‌పర్సన్‌పై చింతమనేని ఆగ్రహం వైద్యఆరోగ్యశాఖపై చర్చలో భాగంగా దెందులూరు ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ దెందులూరు సిహెచ్‌ఎస్‌లో ఎక్స్‌రేకు సంబంధించిన మిషన్‌ కొనుగోలు చేశారని, అవి ఇక్కడ లేకపోవడంపై వైద్యఆరోగ్య శాఖాధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా జెడ్‌పి ఛైర్‌పర్సన్‌ పద్మశ్రీ జోక్యం చేసుకుని సబ్జెక్ట్‌పై మాట్లాడాలని అనడంతో చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాప్రతినిధులుగా మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సమావేశంలో ప్రస్తావించడానికి మాకు హక్కు ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరగాల్సిన మీటింగ్‌ను సాయంత్రం ఏర్పాటు చేసి మాట్లాడాలంటే ఏవిధంగా ఎజెండా పూర్తవుతుంది. మొక్కుబడి సమావేశాలతో ఉపయోగం ఏమిటీ. నా అభిప్రాయం చెప్పడానికి ఇదొక వేదిక. కొవ్వలి గ్రామానికి చెందిన 50 మంది జ్వరాలతో దెందులూరు ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పటి వరకూ జిల్లా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. నేను మాట్లాడి తహశీల్దార్‌, ఎంపిడిఒను పంపించాను. ఇది జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు తమ సమస్యలను చెప్పుకునే వేదిక. ఇక్కడ వారికి మాట్లాడే సమయం లేకుండా పోయింది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అధికారులతో ఎంఎల్‌ఎలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి’ అని చింతమనేని ప్రభాకర్‌ కలెక్టర్‌ను కోరారు. మంత్రి నిమ్మల రామానాయుడు సర్ది చెప్పడంతో చింతమనేని శాంతించారు.

➡️