ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు నగర పాలక సంస్థ అత్యవసర సమావేశం ఈనెల 20న నిర్వహించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు నిర్ణయించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మేయర్ రాజీనామాను కౌన్సిల్‌లో చర్చించి ఆమోదిస్తారు. తరువాత నూతన మేయర్ ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్‌కు జిల్లా కలెక్టర్ నివేదిస్తారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నూతన మేయర్ ఎన్నికకు షెడ్యూలు ప్రకటిస్తుంది. ఈ ప్రక్రియ ముగిసే లోగా కార్పొరేషన్ వ్యవహారాలను నిర్వహించేందుకు మేయర్ స్థానంలో ఇన్‌ఛార్జి మేయర్‌గా డిప్యూటీ మేయర్‌ను నియమిస్తారు. ఒక్క డిప్యూటీ మేయర్ ఉంటే ఇన్‌ఛార్జి మేయర్‌గా ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉండటం, ఒకరు వైసిపి, మరొకరు టిడిపి తరుఫున ఉండటంతో ఈ పదవి ఎవరికి ఇస్తారన్నదీ చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ మేయర్‌గా తొలుత డైమండ్‌బాబు నియమితులయ్యారు. మేయర్ మనోహర్ నాయుడుతోపాటు డైమండ్ బాబు కూడా 2021 మార్చి 18న ప్రమాణస్వీకారం చేశారు. తరువాత రాజకీయ ఉపాధి, సమీకరణల పేరుతో అప్పటి వైసిపి ప్రభుత్వం కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్, మున్సిపాల్టీల్లో రెండో వైస్ చైర్మన్ పదవులను ప్రకటించింది. గుంటూరు రెండో డిప్యూటీ మేయర్‌గా వైసిపి నుంచి ఎంపికైన షేక్ సజీల 2021 మేలో ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సీనియారిటీ ప్రాతిపదికన తమకే అవకాశం ఇవ్వాలని డైమండ్ బాబు గ్రూపు వాదిస్తోంది. అయితే ఎన్నికల ముందే టిడిపిలో చేరిన రెండో డిప్యూటీ మేయర్ సజీలను ఇన్‌ఛార్జి మేయర్‌గా ప్రకటించాలని టిడిపి నాయకలు పట్టుబడుతున్నారు. అయితే ఇన్‌ఛార్జి మేయర్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై ప్రభుత్వానికి నివేదిక పంపామని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఎవరికి ఎంపిక చేస్తే వారే ఇన్‌ఛార్జి మేయర్ హోదాలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించడంతో పాటు తదుపరి మేయర్‌ను ఎన్నుకునే వరకు వారే కొనసాగుతారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మేయర్ కావటి మనోహర్ నాయుడు వైసిపి నాయకులకు సమాచారం ఇవ్వకుండా రాజీనామా చేయడంతో ఆ పార్టీ నాయకులు తదుపరి కార్యచరణపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మేయర్‌ను పలువురు వైసిపి నాయకులు, కార్పొరేటర్లు ఆదివారం సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. మరోవైపు సోమవారం జరగాల్సిన నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం యధాతథంగా జరుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మేయర్ రాజీనామా చేయడం వల్ల కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఒకరిని అధ్యక్షులుగా ఎంపిక చేసి సమావేశం నిర్వహిస్తామన్నారు. డిసెంబరు 20, జనవరి 4న రెండు విడతలుగా నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశం అసంపూర్తిగా ముగియగా ఈ సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ఇంకా అధికారులు నిర్ణయం తీసుకోలేదు. మేయర్ రాజీనామా వల్ల ఏర్పడిన ప్రతిష్ఠంభనతో ఇన్‌ఛార్జి మేయర్ ఎంపిక పూర్తయిన తరువాతనే సర్వసభ్య సమావేశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
