ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో థర్డ్‌ పార్టీలో శానిటేషన్‌, సెక్యూరిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వెంకటసుబ్బయ్య, ట్రిపుల్‌ ఐటి కాంట్రాక్టర్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షులు రామసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం శానిటేషన్‌ సెక్యూరిటీ బెస్ట్‌ కంట్రోల్‌లో పనిచేస్తున్న కార్మికులకు జీవో ఎంఎస్‌ నంబర్‌ 549 ప్రకారం రూ.16 వేల వేతనం ఇవ్వాలని 2021, జనవరి 18న అగ్రిమెంటు కుదిర్చి థర్డ్‌ పార్టీకి అప్పగించారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ జీవో ప్రకారం వేతనాలు థర్డ్‌ పార్టీ కాంట్రాక్టర్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. తాము గతంలో చాలాసార్లు గత ప్రభుత్వం, అధికారుల దష్టికి తీసుకెళ్లామని, అయినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు యథ్ఛేగా దోచు కుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పిఎఫ్‌, ఇఎస్‌ఐ కాంట్రాక్టర్‌ కట్టాల్సిన శాతం, కార్మికులు కట్టాల్సిన శాతం రెండు కార్మికుల వేతనంలోనే కట్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది పిఎఫ్‌ చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. అలాగే ఇఎస్‌ఐ చట్టాన్ని కూడా ఉల్లంఘించడమే, ఇప్పు డున్న కాంట్రాక్టర్లు జీవోలు అమలు చేయడం లేదని వాపోయారు. వారికి నచ్చిందే జీవో నని, వారు చేసిందే చట్టం అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వేసే టెండర్లనైన కార్మికులకు కట్టాల్సిన పిఎఫ్‌ శాతం మాత్రమే కార్మికులు కట్టే విధంగా చూడాలని తెలిపారు. కాంట్రాక్టర్‌ కట్టాల్సిన పిఎఫ్‌ శాతం కచ్చితంగా కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కడప జిల్లాలో పేద విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటిలో చదివే దానికోసం గొప్ప అవకాశం కడప జిల్లాలో ఉందన్నారు. అందులో పని చేసే శానిటేషన్‌ కార్మికులకు అక్కడ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న అనిల్‌ కుమార్‌రెడ్డి అనే ఒక ఉద్యోగి శాపంగా మారారని అక్కడున్న కార్మికులు వాపో తున్నారని పేర్కొన్నారు. వారికి రావాల్సిన సెలవులు కానీ, అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు కలిగితే వెళ్లే ప్రక్రియలో కానీ అతను నియంతలా వ్యవహ రిస్తున్నారన్నారు. ఏదైనా అనారోగ్య కారణాల చేత లేటుగా వచ్చిన, విధులకు హాజరు రాలేకపోయినా వారిని విధుల నుంచి వారం, పది రోజులుగాని సస్పెం డ్‌ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా చలామణి అవుతున్న అనిల్‌ కుమార్‌ రెడ్డికి అను మతులు ఏమన్నా ఇచ్చారా, ఇవ్వకుండా ఉంటే అలా చేసే అధికారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న అనిల్‌ కుమార్‌ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే కార్మికులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

➡️