ప్రజాశక్తి-ఈపూరు : సామాజిక పింఛనును లబ్ధిదార్లకు ఇవ్వకుండా ఆ సోమ్ముతో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు పరారయ్యారు. ఈపూరు మండలం మండలంలోని బొమ్మరాజుపల్లి గ్రామ సచివా లయ వెల్ఫేర్ అసిస్టెంట్ బి.గోవర్ధన్ నాయక్ తన పరిధిలో 73 మంది లబ్ధిదారులు ఉండగా 34 మందికి పంపిణీ చేశాడు. మిగిలిన 39 మందికి సంబంధించిన రూ.1.76 లక్షలు పంచకుండా, అందుబాటులో లేకుండా పోయా డని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. తోటి ఉద్యోగులు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంపిడిఒ కె.ప్రభాకర్‌రావును సంప్రదించగా పరారీ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే ఉద్యోగి బంధువు ఒకరు నగదును సమకూర్చారని, ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా రూ.2.30 లక్షల పింఛను సొమ్ముతో గురజాల మండలం తేలుకుట్ల సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ బత్తుల వెంకట నారాయణ పారిపోగా సస్పెండ్ చేస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట నారా యణ నుండి నగదు రికవరీ చేసి చట్టపరమైన చర్యలకు అధికారులను ఆదేశించారు.