ప్రజాశక్తి – పాచిపెంట : ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీ గా అమలు చేయాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండలంలోని కొటికిపెంట పంచాయితీ నీలయమ్మ చెరువు వద్ద కోడి కాలవలస, గరిల్లవలస గ్రామాల ఉపాధికూలీలతో ఆయన మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సాధించుకున్న ఉపాధి చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. పని చేసిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నీలయమ్మ చెరువు వద్ద ఎండలకు తట్టుకోలేక సొంతంగా చలువ పందిర్లు వేసి ఎండలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం లేదన్నారు. మూడేళ్ల కిందట గుణపాలు, పారలు అందించారని, ఇప్పుడు ఇవ్వడంలేదని అన్నారు. పనిచేసిన కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అవినీతికి తావు లేకుండా కూలీలకు గిట్టుబాటు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు పూటలా పనులు చేసే పద్ధతి మార్చుకోవాలన్నారు. 200 రోజులు పని దినాలు పెంచాలని, రూ.300కు తక్కువ లేకుండా కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు మాదల సత్యవతితో పాటు జి.సావిత్రి, పైల లక్ష్మణరావు, బదనాన్న అప్పలస్వామి, సుంకి జన్ని, రవి తదితరులు పాల్గొన్నారు.
