ప్రజాశక్తి – పెద్దాపురం : పెద్దాపురం పట్టణ పరిధిలో వివిధ చేతి వృత్తిదారులకు ఇంటి నుండే ఉపాధి పొందే విధంగా శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటి వరకు 107 మందిని గుర్తించినట్లు మెప్మా సీఎంఎం భ్రమరాంబ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సర్వీస్ ప్రొవైడర్లకు, హోమ్ ట్రయాంగిల్ సంస్థ ప్రతినిధులతో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు కు ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ శిక్షణ నిమిత్తం వృత్తిదారులు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. ఈ సదస్సులో టిపిఓ ఫణి కుమార్ మాట్లాడుతూ ‘ ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త ‘ వాక్ టు వర్క్ కార్యక్రమంలో భాగంగా పట్టణ మహిళా సంఘాలు, వారి కుటుంబ సభ్యులలో చేతి వృత్తిదారులను గుర్తిస్తున్నామన్నారు. పంబ్లింగ్, ఎలక్ట్రికల్ వర్క్, కార్పెంటర్, గృహోపకరణాల రిపేర్లు, మెకానిక్, బ్యూటీషిన్లు గుర్తింపు జరుగుతుందన్నారు. గుర్తించిన వారందరికీ హోమ్ ట్రయాంగిల్ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేసి జీవనోపాధి కల్పించబడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మెప్మా సీఓ లు శ్రీదేవి, నర్గీస్ , రిసోర్సు పర్సన్లు, సర్వీసు ప్రొవైడర్లు పాల్గొన్నారు.