చల్లగుండ్లలో ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు
ప్రజాశక్తి – నకరికల్లు : మండలంలోని పలు గ్రామాల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు బుధవారం పర్యటించారు. కండ్లకుంటలో రీ సర్వే పనులను, చల్లగుండ్లలో ఉపాధి హామీ పనులను, నకరికల్లులో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. కండ్లకుంటలోని భూముల రీ సర్వేను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ-సర్వే వల్ల సమస్యలేమైనా ఉన్నాయా? సక్రమంగా కొలతలు వస్తున్నాయా? అని స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సమస్యలుంటే సంబంధిత అధికారులను కలిసి పరిష్కరించ కోవాలని సూచించారు. అనంతరం చల్లగుండ్లలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. పని చేస్తున్న వారికి ఇస్తున్న కూలి, అది సరిపోతుందీ? లేనిదీ కూలీలను అడిగారు. ఎండ తీవ్రత దష్ట్యా రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని, ఉదయం 6 గంటల నుండి 11 గంటల లోపే పనులు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ శ్రమ కార్డులు కార్మికులకు ఉన్నదీ లేనిదీ వివరాలు అడిగారు. అనంతరం నకరికల్లు జెడ్‌పి పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమాలలో ఉపాధి హామీ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధ లింగమూర్తి, సత్తెనపల్లి ఆర్డీవో రమాకాంత్‌రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డు అధికారి మధుకీర్తి, డీఈవో చంద్రకళ, తహశీల్ధార్ పుల్లారావు, సచివాలయ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
