ప్రజాశక్తి-మాధవధార : ఆంధ్రప్రదేశ్‌లో రజక వృత్తిదారులకు ఉపాధి రక్షణ కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎపి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మడక రాజు డిమాండ్ చేశారు. కంచరపాలెం హైవేలోని బొట్టా నర్సింగరావు భవనంలో ఎపి రజకవృత్తిదారుల సంఘం విశాఖ జిల్లా మహాసభలు పివి.రమణ, ఆనంద్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ మహాసభకు రాష్ట్ర కమిటీ నుంచి ఎం.రాజు పరిశీలకులుగా హాజరై మాట్లాడుతూ, రజక వృత్తిదారులకు గత 30 ఏళ్లుగా ప్రభుత్వాలు అన్నివిధాలా ద్రోహం చేస్తున్నాయన్నారు. బిసి సంక్షేమమే ధ్యేయమని వచ్చే ప్రభుత్వాలన్నీ మాటలు చెబుతున్నాయని విమర్శించారు. నిధులు కేటాయించని బిసి కార్పొరేషన్ ఎందుకని ప్రశ్నించారు. గతంలో కార్పొరేషన్ నుంచి వృత్తికి లోన్లు, సబ్సిడీలు అమలయ్యేవని గుర్తుచేశారు. నేడు ఎన్నికల్లో వృత్తిదారులను వాడుకుంటున్నారు తప్ప ఎటువంటి సంక్షేమ పథకాలూ అమలు కావటం లేదన్నారు. దోబీఘాట్లు కొత్తవి ఏర్పాటు, ఉన్నవాటికి నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించే పని చేయడంలేదన్నారు. విశాఖపట్నంలో 50 వేల మంది రజకవృత్తిదారులు గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇళ్లల్లో పాచిపనులు, వాచ్ మ్యాన్‌లు, బిల్డింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరికి ఎటువంటి రక్షణా లేదన్నారు. పనిప్రదేశాల్లో, నివాసప్రాంతాల్లో అవమానాలకు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రజకవృత్తిదారులకు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఈశ్వరరావు మూడేళ్లలో చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను వివరిస్తూ భవిష్యత్తు మూడేళకలకు ప్రణాళికను ప్రకటించారు. రజక వృత్తిదారులకు ఏ సమస్య వచ్చినా ఎపి రజకవృత్తిదారుల సంఘం (ఆర్‌విఎస్) అండగా నిలిచిందన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల వృత్తిని కోల్పోవల్సి వస్తోందన్నారు. రజక వృత్తిదారులకు బిసి కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు చేయాలని, బొగ్గు ఉచితంగా సరఫరా చేయాలని, పిల్లల విద్యకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని, దోబీఘాట్‌లకు ఉచిత కరెంటు సదుపాయం కల్పించాలని, 50ఏళ్ల వయస్సు వారికి ప్రభుత్వ పెన్షన్ ఎటువంటి నిబంధనలు లేకుండా అమలుకోసం భవిష్యత్తు ఉద్యమాలు చేపడతామని తెలిపారు.నూతన కమిటీ ఎన్నిక ఎపి రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా పట్నాల వెంకటరమణ, మల్లేశ్వరపు ఈశ్వరరావు, ఉపాధ్యక్షులుగా బైరిశెట్టి ఆనందరావు, సహాయ కార్యదర్శిగా మడక రమణ, కోశాధికారిగా ఎం.విజరుకుమార్‌తో పాటు మరో 7గురు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.