తెలంగాణ డీఎస్సీలో తెనాలి యువకుని సత్తా

Nov 3,2024 00:20

ఉన్నతాధికారుల నుంచి నియామక పత్రం అందుకుంటున్న గోపీచంద్‌
ప్రజాశక్తి – తెనాలి :
విద్యతోపాటు, ఉపాధికి అవకాశం ఉన్న మార్గాలను ఎంచుకుని చదవటం కూడా ముఖ్యమేనని ఓ యువకుడు నిరూపించాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ నియామకాలలో నాన్‌ లోకల్‌ క్యాటగిరిలో రూరల్‌ గ్రామం కొలకలూరుకు చెందిన మంచికలపూడి గోపీచంద్‌ సెకండరీ గ్రేడ్‌ (ఉర్దూ) ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌ ఎల్బి స్టేడియంలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పెద్ద ఎత్తున అభినందన సభ నిర్వహించి, అక్కడి విద్యాశాఖ అధికారులు, మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందించిన సంగతి తెలిసిందే. గోపీచంద్‌ తల్లిదండ్రులు లలితయ్య, సత్యవతి చిన్నప్పటి నుండి ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉన్న కోర్సులను ఎంపిక చేసి పిల్లలను చదివించారు. దీనిలో భాగంగానే గోపిచంద్‌ తో పాటు కుమార్తెను కూడా ప్రాథమిక విద్యా స్థాయి నుంచి ఉర్దూలో చదివించారు. పది, ఇంటర్లో కూడా ఉర్దూ రెండో భాష ఎంపిక చేసుకుని చదివిన గోపీచంద్‌, కడపలో ఉర్దూలో డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డిఎడ్‌) చదివాడు. తదుపరి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ యూనివర్సిటీలో ఉర్దూ డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో నాన్లోకల్‌ క్యాటగిరి లో పోటీపడి ఉపాధ్యాయ కొలువును సొంతం చేసుకున్నాడు. పొరుగు రాష్ట్రంలో నాన్‌ లోకల్‌ కేటగిరీలో ఉద్యోగం పొందటమే కాకుండా, ఉర్దూ భాషను ఎంచుకుని చదవడం, లక్ష్య సాధనలో జయకేతనం ఎగురవేయడం పట్ల గోపీచంద్‌ ను పలువురు గ్రామస్తులు అభినందించారు.

➡️