ప్రజాశక్తి-రాయచోటి టౌన్ ఏళ్ల తరబడి పనిచేసినా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల జీవితాల్లో మార్పు లేదని ఇప్పటికయినా కూటమి ప్రభుత్వం వారి గోడు విని ఆదుకోవాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బివి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర కమిటి పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజినీరింగ్ కార్మికుల ధర్నాకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పని గంటలు పెంచి కేవలం రూ.15 వేల వేతనం ఇస్తున్నారని పారిశుధ్య కార్మికులతో పాటు రూ.21 వేలు వేతనం ఇవ్వాల న్నారు. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచి ఆప్కాస్ కొనసాగించాలని లేనిపక్షంలో పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమపథకాలు అమలు చేయాలని, రక్షణ పరికరాలతో పాటు నాణ్యమైన పనిముట్లు సరఫరా చేయాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయకపోవడాన్ని కార్మికుల్ని దగాచేయడం కాదా అని ప్రశ్నించారు. వాటర్ సెక్షన్ అధ్యక్షులు అక్బర్, కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆప్కాస్ కొంసాగించి ప్రవేట్ ఏజెన్సీ లకిచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేప థ్యంలో ప్రజల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన చెందారు. నీటి కొరత నివారణకు పాలక అధికార యంత్రాంగం చర్యలు చేపట్టి ప్రజల ఆక్రోషం నుండి కాపాడాలని తెలిపారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కార్మికులు దేవా, రమేష్ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి, మౌనిక, రమణ పాల్గొన్నారు.మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలిమదనపల్లె అర్బన్ : ఆప్కాస్‌లో పని చేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు అన్నారు. బుధవారం మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలని, మతి చెందిన పారిశుధ్య కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. బకా యిలు విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు. మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఇఎస్‌ఐ, పిఎఫ్ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని, పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని కోరుతుంటే అందుకు భిన్నంగా ఉన్న కార్మికులును మస్తర్‌లో హాజరు వేసుకుని ఇంటికి వెళ్లే కార్మికులకు అధికారులు వత్తాసు పలుకుతూ మిగిలిన కార్మికులపై పనిబారం పెంచుతున్నారని తెలిపారు. మదనపల్లి మున్సిపాలిటీలో నలుగురు పారిశుధ్య కార్మికులను బలవంతంగా రిటైర్ చేసి వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వక పోవడం దారుణమన్నారు. నాయకులు జి.కష్ణమూర్తి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం విడనాడాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ వరపన మనూజరెడ్డి, కమిషనర్ ప్రమీలకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు చలపతినాయుడు, సాంబశివనాయక్, రామకష్ణ, గోపాల్, కష్ణప్ప, శ్రీనివాసులు, శ్రీరాములు, రమణమ్మ, రఘునాథ్ పాల్గొన్నారు.
