ఇంజినీరింగ్‌ కార్మికులసమస్యలను పరిష్కరించాలి

May 14,2025 21:42

ప్రజాశక్తి – సాలూరు :   మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. బుధవారం సాలూరులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. మున్సిపల్‌ డిఎంఎ విజయవాడలో అన్ని సంఘాలను చర్చలకు పిలిచి జీతాల సమస్యపై మంత్రితో చర్చిస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికే అనేక దఫాలు కార్మిక సంఘాలతో కార్మికుల సమస్యలపై చర్చించారని తెలిపారు. ఇంకా కాలయాపన చేయడం దారుణమన్నారు. ఇప్పటికే కార్మికులు చాలీచాలని జీతాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి జూన్‌ ఒకటో తేది వరకు గడువిస్తున్నామని, లేకుంటే అన్ని సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇంజినీరింగ్‌ సెక్షన్‌ నాయకులు డి.సంతోష్‌, కాశి, ఈశ్వరరావు, శ్రీను, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిపార్వతీపురం టౌన్‌ : పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని 75 మంది మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల పిఎఫ్‌ సమస్యను ఐదేళ్ల నుంచి పరిష్కరించడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ, కోశాధికారి గొర్లి వెంకటరమణ అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌తో ఈ సమస్యలపై చర్చలు జరిపారు. ఇప్పటికైనా స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ చొరవ చూపి మూడేళ్ల పిఎఫ్‌ మొత్తాన్ని కార్మికుల పిఎఫ్‌ ఖాతాకు జమ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. చెత్త సేకరణ బళ్లు మరమ్మతులకు గురయ్యాన్ని, వాటిని బాగుచేయాలని కమిషనర్‌ను కోరారు. పెరుగుతున్న పట్టణ జనాభాకి, విస్తీర్ణానికి తగినట్టుగా అదనంగా కార్మికులను నియమించాలని కోరారు. ఈ సమస్యలపై తక్షణమే చర్యలు చేపడతానని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సూరిబాబు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు సిహెచ్‌ సింహాచలం, నాగవంశం మల్లేష్‌, శంకరరావు, మామిడి శివ తదితరులు పాల్గొన్నారు.

➡️