పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

Jan 16,2025 20:48

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లన్నయ్య అన్నారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా 9వ డివిజన్‌లో ఆయన పర్యటించారు. స్థానిక కార్పొరేటర్‌ సయ్యద్‌ గౌస్‌ షకిల్‌తో కలిసి ఆయన మహారాణిపేట, సుంకరవీధి, గౌడ వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విచ్చలవిడిగా పశు సంచారం తమ ప్రాంతాల్లో జరుగుతుందని స్థానికులు తెలియ జేయడంతో పశువులను క్రమ పద్ధతిలో నిలుపుదల చేసుకోవాలని, ఎక్కడబడితే అక్కడ పశు సంచారం చేస్తున్నట్లు గమనిస్తే వాటిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. కాలువలు, రహదారులను పరిశీలించారు. రహదారులపై చెత్తాచెదారాలను వేయవద్దని, ప్రభుత్వం అందించిన తడి చెత్త పొడిచెత్త బుట్టలను వినియోగించు కుని చెత్త తరలించే వాహనాలకు అందివ్వాలని చెప్పారు. ప్రజలలో మరింత అవగాహన తీసుకొచ్చి శతశాతం చెత్త వర్గీకరణ సేకరణ చేపట్టేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. స్వచ్ఛ విజయనగరం సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పొగ రహిత వంటకాలు మాత్రమే నిర్వహించాలి

పొగ రహిత వంటక కేంద్రాలు మాత్రమే నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లన్నయ్య ఆదేశాలతో ప్రజారోగ్య సిబ్బంది గురువారం వివిధ ప్రాంతాలకు వెళ్లి అవగాహన కల్పించారు. కొన్ని కేంద్రాలలో కమర్షియల్‌ గ్యాస్‌ విధానాలను దగ్గరుండి ఏర్పాటు చేయించారు. కొత్తపేటలో ఉన్న చేగొడి కేంద్రంలో పొగ వచ్చే పొయ్యిలను కాకుండా గ్యాస్‌ ద్వారా మాత్రమే వంటకాలను చేపట్టాలని అందుకు తగిన పూర్తి అవగాహనను కల్పిస్తూ గ్యాస్‌ పొయ్యిలను, సిలిండర్లను, పైప్‌ లైన్లను ఏర్పాటు చేయించారు. నగరంలో మిగిలి ఉన్న అన్ని మిఠాయి కొట్లు, టిఫిన్‌ దుకాణాలు, హోటళ్లు తదితర వాటిలో కూడా పొగ వెదజల్లకుండా కేవలం గ్యాస్‌ ఆధారిత వంటకాలను మాత్రమే చేపట్టే ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్‌ పల్లి నల్లనయ్య ఈ సందర్భంగా తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు నగరంలో ఎక్కడా పొగ వచ్చే ప్రతి వంటక కేంద్రాన్ని నిరోధిస్తున్నట్లు తెలిపారు. వారిలో అవగాహన కల్పించి కేవలం గ్యాస్‌ తో మాత్రమే వంటకాలు చేపట్టేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగించే పొగవల్ల, తీరని నష్టం ఉంటుందని, అందువల్ల చైతన్య పరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో పారిశుధ్య పర్యవేక్షకుడు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️