ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : కాగితం సంచుల తయారీని, వాడకాన్ని ప్రోత్సహిద్దామని, తద్వారా ప్లాస్టిక్ సంచుల వినియోగానికి చరమగీతం పాడుదామని జనవిజ్ఞాన వేదిక మలికిపురం మండల శాఖ అధ్యక్షులు పి.వి.వి.వరప్రసాద్ అన్నారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని వివేకనందా స్కూల్ లో శుక్రవారం ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ … ప్లాస్టిక్ సంచుల స్థానంలో పేపరు సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు అవకాశం కలుగుతుందని అన్నారు. జిల్లాలో కాగితపు సంచుల తయారీని ప్రోత్సహించేలా ప్రభుత్వం కాగితపు సంచుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించాలని వివేకనంద పాఠశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలగబోయే నష్టాలను వివరిస్తూ నినాదాలు చేశారు. తమ విద్యాసంస్థల విద్యార్థులు సామాజిక స్పఅహతో చేస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు.
