ఇపిఎస్‌ కనీస పెన్షన్‌ రూ.9 వేలు ఇవ్వాలి : ఆల్‌ పెన్షనర్స్‌ పర్సన్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : ఇపిఎస్‌ కనీస పెన్షన్‌ రూ.9 వేలు ఇచ్చి డిఏ ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, ఆల్‌ పెన్షనర్స్‌ పర్సన్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు వి.శేషగిరిరావు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని టిఆర్‌ కాలనీ అంబేద్కర్‌ విగ్రహం వద్ద సోమవారం పెన్షనర్ల విద్రోహ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసిన కార్మికులు, ఉద్యోగులు పిఎఫ్‌ డబ్బులు చెల్లించి భవిష్యత్‌ అవసరాలు కోసం దాచుకుంటున్నారని, అటువంటి కార్మికులు, ఉద్యోగులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్‌ ఇవ్వడం లేదని విమర్శించారు. దేశ వ్యాప్తంగా 75లక్షల 88వేల913మంది ఇపిఎస్‌ పెన్షన్‌ దారులు ఉంటే ఒకొక్కరికి నెలకు రూ. వెయ్యి నుంచి రూ. 3వేలు లోపు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు దాచుకున్న డబ్బులకు నెలకు వడ్డీ రూ.51.81కోట్లు వస్తే పెన్షన్‌ మాత్రం నెలకు రూ.14.44కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు పిఎఫ్‌ సొమ్ము నుంచి వస్తున్న వడ్డీలో మిగులు సొమ్మును ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంటులో ఎంపిలు ప్రశ్నిస్తే నిధులు లేవని మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపిఎప్‌ఓ కార్యాలయం వద్ద ఉన్న సొమ్ముపై వస్తున్న వడ్డీతో నెలకు ఒకొక్కరికి రూ.5వేలు చెల్లించే అవకాశం ఉన్న ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం స్పందించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు పెన్షన్‌ రూ.9వేలు చెల్లించి డిఏ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిచో పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్‌.గోపాలం, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు టి.రమణ, జి.సింహచలం, పి.కఅష్ణ, పెన్షనర్స్‌ పాల్గొన్నారు.

➡️