ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలో అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని గత 14 రోజులుగా ఆందోళన కొనసాగుతోంది. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో మున్సిపల్ ఛాంబర్‌ను సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణ నుండి సరైన సమాధానం రాకపోవడంతో సిఐటియు నాయకులతో పాటు కార్మికులు కమిషనర్ ఛాంబర్‌లో బైఠాయించారు. దీంతో పట్టణ ఎస్‌ఐ ఎం.సైదుబాబుకు కమిషనర్ సమాచారమిచ్చారు. ఆందోళన విరమింపజేయాలని ఎస్‌ఐ విజ్ఞప్తి చేశారు. ‘మా కడుపు కొట్టొద్దు సార్..’ అంటూ వారు ఆయన కాళ్లపై పడ్డారు. ఎప్పటి నుంచో ఇదే పని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, తామంతా ఆప్కాస్‌లో ఉన్నామని, అక్రమంగా తమను తొలగించడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ప్రాధేయపడ్డారు. ఈ తొలగింపులు అక్రమమో… సక్రమమో… ఒకటి రెండు రోజుల్లో జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించేంత వరకు వేచి ఉండాలని, అప్పటి వరకు ఆందోళన చేయవద్దని కమిషనర్ నారాయణ సమాధానం ఇవ్వడంతో ఆందోళన విరమించారు.