ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : రామ్ నగర్ వుడా కాంప్లెక్స్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన టూరిజం యాప్ మేక్ మై ట్రిప్ సంస్థ కార్యాలయాన్ని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆదివారం ప్రారంభించారు. ఎపి టూరిజం డెవలప్మెంట్లో భాగంగా నూతన ట్రావెల్ ప్యాకేజీలు, విదేశీ పర్యటనల సమాచారం గురించి ఆయన మాట్లాడుతూ, విశాఖకు ఇది ఒక కొత్త సౌకర్యం అన్నారు. మేక్ మై ట్రిప్ ద్వారా విశాఖ ప్రజలు ఆన్ లైన్తో పాటు ఇప్పుడు ఆఫ్ లైన్ విధానంలో కూడా టూర్స్ బుకింగ్ చేసుకునే సౌలభ్యకుందన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటుచేశారని తెలిపారు. ఈ సంస్థ కార్యకలాపాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, టూరిజం బాగా అభివృద్ధి చెందిన తరుణంలో ఇటువంటి సంస్థలు ఎంతయినా అవసరం అన్నారు. సంస్థ ఫ్రాంచైజీ కార్యాలయం మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ ఆకార్ మాట్లాడుతూ, ఐదేళ్లలో ట్రావెలింగ్ పెరిగిందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆఫ్ లైన్ బుకింగ్ వల్ల కుటుంబ సభ్యులు అవసరాలకు అనుగుణంగా ట్రావెల్ ప్యాకేజీ బుకింగ్స్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో 176 దేశాలకు టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సంస్థ అసోసియేట్ డైరెక్టర్ మనీష్ భారతి, మేక్ మై ట్రిప్ అధికారి వైభవ్, విశాఖ బ్రాంచ్ మేనేజర్ బబిత పాల్గొన్నారు.
