ప్రజాశక్తి-సత్తెనపల్లి : కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటిన ఇసుక సరఫరా అవ్వక, ఇళ్ల నిర్మాణాలు జరగక, భవన నిర్మాణ పనుల్లేక కార్మికుల కష్టాలు పడుతున్నారని భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎ.ప్రసాద్‌రావు అన్నారు. స్థానిక గార్లపాడు బస్టాండ్ సెంటర్ అడ్డా వద్ద కార్మికులు బుధవారం నిరసన ర్యాలీ చేపట్టగా ప్రసాద్‌రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరిగిందని, తమ ప్రభుత్వం వస్తే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పిన కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత మూడు నెలల నుండి పల్నాడు జిల్లాలో ఇసుక సరఫరా కాక కార్మికులకు పనులు లేక కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. ఉచిత ఇసుక అని ప్రభుత్వం ప్రకటించడమే కానీ ఆచరణలో అమలు కావడం లేదన్నారు. పల్నాడు జిల్లా చుట్టూ ఇసుక రీచ్‌లు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో పల్నాడు జిల్లాను చూపించడం లేదని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరికీ వినతి పత్రాలిచ్చిన స్పందన లేదని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో ఇసుక లేక కొంతకాలం, కరోనా లాక్డౌన్ కాలంలో మరికొంత కాలం పనుల్లేక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణం కార్మికులకు రూ.10 వేల ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్ కార్యాలయాల వద్ద శుక్రవారం జరిగే ధర్నాలో భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం పట్టణ అధ్యక్షులు జి.సాల్మన్‌రాజు, నాయకులు, విహెచ్ రామారావు, కె.ఆంజనేయులు, పి.శ్రీను, ఆర్.కొండలు, జార్జి, రాంబాబు, అంకమ్మరావు పాల్గొన్నారు.