కలెక్టర్‌, ఎస్పీ ఉన్నా వైసిపి దాడులు

May 15,2024 00:30

మాట్లాడుతున్న కొమ్మాలపా శ్రీధర్‌. పక్కన అభ్యర్థులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసిపి నాయకులకు సూచించిన నేపథ్యంలోనే పల్నాడు జిల్లాలో ఓటమిని జీర్ణించుకోలేక వైసిపి నేతలు దాడులకు పాల్పడ్డారని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. విజ్ఞులైన ప్రజలు సరైన తీర్పు ఇస్తారని చెప్పారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఎన్‌డిఎ కూటమి తరుపున పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజవకర్గ టిడిపి అభ్యర్థులతో కలిసి మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో టిడిపి శ్రేణులపై దాడికి పాల్పడిన వైసిపి శ్రేణులను గుర్తించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలింగ్‌ శాతం చూసిన వైసిపి దాన్ని తగ్గించడానికి వివాదాలు సృష్టించారని ఆరోపించారు. దాడులు జరిగిన పోలింగ్‌ కేంద్రాల వద్ద రీ పోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేశారు. వైసిపికి అనుకూలంగా జిల్లా ఎస్పీ, ఎన్నికల యంత్రాంగం మొత్తం వ్యవహరించిందని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడులో ప్రజాస్వామ్యం లేదనే విషయం సోమవారం తేలిపోయిం దన్నారు. వైసిపికి తొత్తుగా పోలీస్‌ వ్యవస్థ మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలంలోని దొండపా డులో పోలీసులు, సబ్‌ కలెక్టర్‌ ముందే తన కాన్వారుపై దాడి చేశారని, పోలీసులు పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసిపి నేతలకు అనుకూలంగా పని చేశారని అన్నారు. నరసరావుపేటలో వైసిపి శ్రేణులు నడిరోడ్డులో చదలవాడ అరవిందబాబుపై దాడి చేసి కార్లను ధ్వంసం చేశారన్నారు. పోలీసులు, అధికారులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. పల్నాడు జిల్లాలో 85.69 శాతం ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడం హర్షణీయమన్నారు.చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పోలింగ్‌ శాతం నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో వైసిపి నేతలు పథకం ప్రకారం పోలింగ్‌ బూత్‌ వద్ద రాళ్ల కుప్పలు, కర్రలు పెట్టుకున్నారని అన్నారు. ఈవీఎంలను బద్దలు కొట్టడానికి వైసిపి శ్రేణులు పూనుకున్నాయని విమర్శించారు. మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఎస్పీ, కలెక్టర్‌ ఇద్దరూ ఉన్నా ఎక్కడా దాడులు ఆగలేదని, వైసిపి నేతలకు పోలీసులు కొమ్ము కాశారని విమర్శించారు. రెంటచింతల మండలం రెంటాలలో టిడిపి ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రం నుండి ఉదయం 7 గంటలకు బయటకు నెట్టేశారని, దీనిపై ఫోన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. వైసిపి శ్రేణులు తన కళ్లల్లో కారం కొట్టి దాడి చేశారని, టిడిపి కార్యకర్తలపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట రామిరెడ్డి కారుతో ఢ కొట్టి అనంతరం దాడి చేశారని చెప్పారు. వైసిపి నేతల వాహనాలలో ఇప్పటికీ రాడ్లు, కర్రలు ఇతర మారణాయుధాలు పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రోద్బలం తోనే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసిపి నేతలు రాళ్లు సిద్ధం చేశారని, వైసిపి నేతల అరాచకాలకు ఎదురు నిలబడి టిడిపి శ్రేణులు పోలింగ్‌ సజావుగా సాగేలా చూశారన్నారు. సమావేశంలో వినుకొండ, నరసరావుపేట, పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థులు జీవీ ఆంజనేయులు, డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, భాష్యం ప్రవీణ్‌, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి.కోటేశ్వరరావు, నాయకులు జి.జనార్దన్‌ బాబు, చల్లా సుబ్బారావు, రఫీ, కె.నాగ సుధీర్‌, టి.నరసింహారావు పాల్గొన్నారు.

➡️