ఎట్టకేలకు కుటుంబం చెంతకు అప్పారావు

Mar 16,2025 21:35

 ప్రజాశక్తి – పార్వతీపురం :  కొండగొర్రి చుక్కా అలియాస్‌ కోనేరు అప్పారావు ఎట్టకేలకు కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఈ 11న కొండగొర్రి చుక్కా కుటుంబ ఆచూకీ లభ్యమైంది. చుక్క కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ను కలెక్టరేట్‌లో ఈనెల 11న కలిశారు. కొండగొర్రి చుక్క (అప్పారావు) కోరాపుట్‌ జిల్లా బంధుగాం బ్లాక్‌ పెద వల్లాడ పంచాయతీ చిన వల్లాడకు చెందిన వ్యక్తి. చుక్కా తప్పిపోవడంతో భార్య విచారంతో మృతి చెందారు. ప్రస్తుతం చుక్క కుమార్తె దొంబుదొర సాయమ్మ, అల్లుడు దొంబుదొర చందు, పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ మునక్కాయవలసలో నివసిస్తున్నారు. తన తండ్రికి బాగా చూసుకుంటామని సాయమ్మ, ఆమె భర్త భరోసా ఇచ్చారు. అన్ని నిర్ధారణ చేసుకున్న అనంతరం తమిళనాడు శివగంగై జిల్లా కలెక్టర్‌తో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ మాట్లాడి వెంటనే పార్వతీపురం నుండి ఉప తహశీల్దార్‌ కిరీటి, సహాయ కార్మిక అధికారి సిహెచ్‌ వెంకటేశ్వరరావును చుక్క కుమార్తె, అల్లుడుతో సహా ప్రత్యేక వాహనంలో పంపించారు. అక్కడ అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకోగా వారిని జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, జిల్లా రెవెన్యూ అధికారి కెహేమలత ఆహ్వానం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చుక్క ఆరోగ్యం, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చుక్క 20 ఏళ్ల క్రితం రైల్‌లో ప్రయాణిస్తూ టీ తాగుటకు రైలు ఆగిన స్టేషన్‌లో దిగారు. ఇంతలో రైలు కదిలిపోవడం, అతను అక్కడ ఉండిపోవడం జరిగింది. 20 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఇంతలో తమిళనాడుకి చెందిన అన్నాదురై గొర్రెల కాపరిగా కట్టు బానిసగా చేశాడు. అక్కడ గొర్రెల కాపరిగా పనిచేస్తున్నట్లు తమిళనాడు కార్మిక శాఖ అధికారులు ఈ ఏడాది జనవరి 31న నిర్వహించిన తనిఖీల్లో గుర్తించారు. ఈ విషయం పలు సమాచార మాధ్యమాల్లోనూ ప్రచురితం అయ్యింది. ఈ సందర్భంగా బొండేడ్‌ లేబర్‌ చట్టం కింద వసూలు చేసి తమిళనాడు ప్రభుత్వం అందించిన రూ.2 లక్షల చెక్కును, రూ.30 వేల నగదును చుక్కకు కలెక్టర్‌ అందజేశారు. చుక్క కు ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆధార్‌ కార్డు తక్షణమే వచ్చేలా నమోదు చేస్తామని ఆయన అన్నారు. కుటుంబ జీవనానికి అవసరమగు గొర్రెల పెంపకం యూనిట్‌ మంజూరు చేస్తామని, గృహం అవసరమైతే మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. 20ఏళ్ల తర్వాత కుటుంబంతో కలపడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులు వచ్చి వివరాలు అందించడం జరిగిందని అన్నారు. చుక్క కు కొత్త బట్టలు అందించారు. కుటుంబంతో కలవడం ఆనందంగా ఉందని చుక్క అన్నారు. సుదీర్ఘ కాలం అనంతరం కుటుంబంతో కలవడం శుభ సూచకమని కుమార్తె, అల్లుడు అన్నారు.

➡️