ప్రతీ దరఖాస్తును ఆడిట్‌ చేయాలి : కలెక్టర్‌

Jan 10,2025 20:55

 ప్రజాశక్తి-విజయనగరంకోట :  రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఆడిట్‌ చేసి సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ తన్‌ ఛాంబర్‌ లో నియోజకవర్గం ఇంఛార్జిలైన డిప్యూటీ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తాహశీల్దార్లు పరిష్కరించిన ప్రతి దరఖాస్తును ఆడిట్‌ చేయాలని చెప్పారు. సదస్సుల్లో మొత్తం 6846 దరఖాస్తులు రాగా, ఇప్పటికే 2776 దరఖాస్తులను తహశీల్దార్లు పరిష్కరించారని, వాటిని కూడా ఆడిట్‌ చేయాలని తెలిపారు. గ్రామాల్లో అర్జీ దారులను పిలిపించి వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపించాలన్నారు. ఈ దరఖాస్తులను పరిష్కరిస్తే జిల్లాలో రెవెన్యూ పరమైన సమస్యలన్నీ దాదాపు పరిష్కరించినట్టేనని తెలిపారు. కోర్టులనుంచి ప్రత్యేకంగా ఏమైనా ఆదేశాలు ఉన్నవి మినహా, వివాదాలు ఉన్న భూములను కూడా పరిష్కరించవచ్చునని సూచించారు. రీ సర్వేలో వచ్చిన దరఖాస్తులను కూడా రెవిన్యూ సదస్సుల్లో కవర్‌ అయినది లేనిది పరిశీలించాలన్నారు. సమాధానాలు అస్పష్టంగా ఉండకూడదని అన్నారు. రోజుకు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని డిప్యూటీ కలెక్టర్లు మొత్తం దరఖాస్తులను ఆడిట్‌ చేయాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ ఎస్‌.శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఒలు కెఆర్‌ఆర్‌సి ఎస్‌డిసి మురళీ, ఇన్‌ఛార్జి డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.

➡️