రాజ్యాంగ విశిష్టత అందరికీ తెలియాలి

Nov 26,2024 21:25

కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ప్రజాశక్తి-విజయనగరంకోట :  భారత రాజ్యాంగం గొప్పదనం, విశిష్టత ప్రతీఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అన్నారు. 75వ భారతరాజ్యాంగ దినోత్సవాన్ని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మన రాజ్యాంగాన్ని ఆమోదించి మనకి మనం అర్పించుకున్న దినంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పేర్కొన్నారు. అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి, దాని గొప్పదనం ప్రతీఒక్కరికీ తెలియాలన్న ఉద్దేశంతో 2015 నుంచి నవంబరు 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతీఏటా ఘనంగా నిర్వహించు కుంటున్నామని తెలిపారు.ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గొప్పదనాన్ని తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవన్‌ మాట్లాడుతూ, మన పెద్దలు ప్రపంచంలోని ఉన్నతమైన వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, మంచిని గ్రహించి మనకు అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఒక దేశంగా మనుగడ సాధించి నిలదొక్కు కొనడానికి రాజ్యాంగం ఎంతగానో దోహద పడిందని అన్నారు. సిపిఒ పి.బాలాజీ మాట్లాడుతూ, రాజ్యాంగం రూపకల్పన, దాని విశిష్టతను వివరించారు. అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఒ డి.కీర్తి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కోర్టులో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్‌ చక్రవర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి టివి రాజేష్‌ కుమార్‌ రాజ్యాంగ పీఠికను కోర్టు సిబ్బంది అందరితో చదివించారు. రాజ్యాంగ యొక్క విశిష్టతను వివరించారు.అంబేద్కర్‌ చిరస్మరణీయుడు విజయనగరం కోట : భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిరస్మరణీయుడని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి బి. లక్ష్మి అన్నారు. గ్రంథాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ప్రాముఖ్యత నుతెలుసుకోవాలన్నారు కార్యక్రమంలో సహాయ గ్రంథాలయ అధికారి కె.శ్రీనివాస్‌, కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ కూర్మచార్యులు, గ్రంథాలయ సిబ్బంది , పాఠకులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో..

విజయనగరంటౌన్‌: జిల్లా పరిషత్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ విగ్రహానికి జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిన ప్రాథమిక హక్కులను వివరించారు. అంతకుముందు సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. కార్య క్రమంలో జెడ్‌పి సిఇఒ బివి సత్యనారాయణ, డిప్యూటీ సిఇఒ ఆర్‌.వెంకటరామన్‌, ఇఇ కెజిజె నాయుడు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.

➡️