పోలింగ్‌కు అంతా సిద్ధం

poling sibbandi

ప్రజాశక్తి -యంత్రాంగం భీమునిపట్నం : నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాలకు ఆదివారం సాయంత్రం పోలింగ్‌ సిబ్బంది చేరుకున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో పిఒ, ఎపిఒ, నలుగురు ఒపిఒలు పోలింగ్‌ సామగ్రితో కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. ఈవీఎంలు, వివి ప్యాట్‌లు, బ్యాలెట్‌ యూనిట్‌లతో కేంద్రాలకు చేరుకోవడం కనిపించింది. వీరితో పాటు పోలీసులు కూడా ఉన్నారు. పెందుర్తి: నియోజకవర్గంలో పరవాడ, సబ్బవరం పెందుర్తితో పాటు ఆరు వార్డులో 289 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేశారు. సుమారు 3000 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాలు వద్దకు ఈవిఎంలను, ఎన్నికల సామాగ్రిని తరలించారు. పోలింగ్‌ బూత్‌ వద్ద పోలీస్‌ సిబ్బందితో పటిష్టమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం, టెంట్లు ఏర్పాటుచేశారు. పద్మనాభం : మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తహశీల్దార్‌ వెంకటరావు తెలిపారు. మండలంలో 45 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేశామన్నారు. 22 పంచాయతీల్లో 42,145 ఓటర్లు ఉన్నారని, వీరిలో మహిళలు 21,521 మంది, పురుషులు 20624 మంది ఉన్నారని వివరించారు. ఎన్నికలు సవ్యంగా నిర్వహించేందుకు ఒక ఎసిపి, ఇద్దరు సిఐలు, 140 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. మధురవాడ : సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోనేందుకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లుచేసినట్లు పిఎం.పాలెం సిఐ వై.రామకృష్ణ తెలిపారు. ఎన్నికలను నిరంతరం మానిటరింగ్‌ చేసేలా సిపి ఆధ్వర్యాన అత్యాధునిక సాంకేతికతను నగర పోలీసు కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటుచేసినట్లు వివరించారు. పిఎం పాలెం స్టేషన్‌ పరిధిలో ఎక్కడైనా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే 112 లేదా 9440796060 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

➡️