ఎన్నికలకు అంతా సిద్ధం : కలెక్టర్‌

Apr 17,2024 21:50

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌  : పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై బుధవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల కానుందని చెప్పారు. గురువారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. 26న స్క్రూట్నీ జరుగుతుందని, 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉందని చెప్పారు. నామినేషన్లను పని దినాల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో స్వీకరిస్తారని చెప్పారు. ఎన్నికలలో భాగంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు తదితర పోస్టులపై నిరంతర నిఘా ఉందని వెల్లడించారు. పెయిడ్‌ న్యూస్‌పైన నిఘా ఉందని, సంబంధిత అభ్యర్థుల ఖాతాల్లో దానికి విలువ కట్టి జమ చేస్తారని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 48 ఎఫ్‌ఎస్‌సి, 36 ఎస్‌ఎస్‌సిటి, 16 విఎస్‌టి, 4 వివిటి బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. జిల్లాలో మొత్తం 342 ఫిర్యాదులు అందాయని, అందులో 171 ఫిర్యాదులు ఎన్నికల కమిషన్‌ పోర్టల్‌లో నమోదయ్యాయని, వాటిలో 166 పరిష్కరించామని వివరించారు. సి-విజిల్‌లో 91 ఫిర్యాదులు అందగా వాటన్నిటినీ పరిష్కరించామన్నారు. 1950 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు 21 ఫిర్యాదులు అందగా వాటిని పరిష్కరించామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలో భాగంగా 64 మంది వాలంటీర్లు, నలుగురు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించామని, ఒక రెగ్యులర్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేశామని ఆయన వివరించారు. రాజకీయ పార్టీల నాయకులపై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. జిల్లాలో 823 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని, 24 మంది వాలంటీర్లపై పార్వతీపురం నియోజకవర్గంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని చెప్పారు. కురుపాం నియోజకవర్గంలో ఒక కాంట్రాక్టు ఉద్యోగిపై ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో – ములిగూడ, బత్తిలి, భామిని, పి.కోనవలస, కూనేరు కూడళ్లలోను, గుణుపూర్‌, పద్మాపూర్‌, దండిగాం, ఆర్‌ కె బట్టివలస, అడారు వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ చెప్పారు. వీటన్నిటిలో వెబ్‌ కాస్టింగు ఏర్పాటు చేశామన్నారు. కొటియా గ్రామాల్లో పోలింగ్‌ గతంలో జరిగే విధంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు జరిగాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. బందోబస్తు పటిష్టంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నామినేషన్లను సమర్పించుటకు వెళ్లే అభ్యర్థులు ముందుగా అనుమతి పొందాలని, తద్వారా ఆ సమయంలో అవసరమగు భద్రత, బందోబస్తు చర్యలు చేపట్టగలమని తెలిపారు. 25 పోలింగ్‌ కేంద్రాల లొకేషన్లను నక్సల్‌ ప్రభావిత ప్రాంతంగా గుర్తించామని చెప్పారు.

➡️