ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూములో భద్రం

అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌కు సీల్‌ వేసిన దృశ్యం

ప్రజాశక్తి-రంపచోడవరం

ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా 11 మండలాలలో 399 పోలింగ్‌ కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సజావుగా ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహించిన అధికారులకు, ఎన్నికల సిబ్బందికి రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల జూనియర్‌ కాలేజీలో అసెంబ్లీకి, పార్లమెంటుకు వేరువేరుగా 399 ఈవీఎంలు, వివిప్యాడ్లు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూములో భద్రపర్చారు. ఎన్నికల పరిశీలకులు పంకజ్‌ సింగ్‌, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ కుమార్‌ సమక్షంలో సీలు వేసి ప్రతిష్టాత్మకమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ రంపచోడవరం ఎఎస్‌పి జగదీష్‌ హెచ్‌ ఎన్నికల రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిష్టాత్మకమైన భద్రత, అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహించే అధికారులు, సిబ్బందికి పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాడేరు, అరకు నియోజకవర్గాల నుండి వచ్చిన ఎన్నికల అధికారులు, సిబ్బంది వారివారి ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు రంపచోడవరం నుండి బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్‌ రోజున రెండు గంటలకు ఒకసారి పోలింగ్‌ శాతాన్ని తెలియజేశామన్నారు. ఓటు ఉన్న పౌరులు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. పాతకోట, బొడ్డగండి, గుర్తేడు పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఇవిఎంలు, వివి ప్యాడ్లు గుర్తేడు నుండి హెలీకాప్టర్‌ ద్వారా రంపచోడవరం స్ట్రాంగ్‌ రూమ్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు. విఆర్‌ పురం మండలం తుమ్ములేరు పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన ఎన్నికల సామాగ్రిని గోదావరిలో పడవలో ప్రయాణించి తీసుకొచ్చినట్లు చెప్పారు. 11 మండలాలలో 399 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన 2,77,317 ఓటర్లకు గాను 2,08,025 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, వీరిలో పురుషులు 1,00,450 మంది, స్త్రీలు 1,07,572 మంది, ఇతరులు ముగ్గురు ఓటు వేశారని చెప్పారు. 75.01 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. తహశీల్దార్లు ఎ.కృష్ణజ్యోతి, ఏవి.రమణ, డివి సత్యనారాయణ, చలపతిరావు, నాగరాజు, నజీముల్లా, నాగమణి, డిప్యూటీ తహశీల్దార్లు శివ, రామకృష్ణ, చైతన్య, సుబ్బారావు, బాలాజీ, బి.రాజు, రవీంద్రబాబు, త్రిమూర్తులు, విశ్వనాథ్‌, సరిత, సీనియర్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, వ్యక్తిగత సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సజావుగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేశారని చెప్పారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఓ చిట్టిబాబు, డివిజనల్‌ పంచాయతీ అధికారి రఘునందన్‌, సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ మోహన్‌ రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

➡️