విలువలతోనే వైద్యవృత్తిలో రాణింపు

జిమ్‌సర్‌

గీతం వైద్య విద్యార్ధుల ‘వైట్‌కోట్‌’ ధారణలో శ్రీభరత్‌

ప్రజాశక్తి -మధురవాడ: వైద్యవృత్తిలో రాణించాలంటే అంకితభావం,సామాజిక బాధ్యతతో ఎదగాలని స్వీయ ప్రతిభను పెంచుకోవాలని కృత్రిమ మేధ వంటి సాంకేతికను ఉపయోగించుకోవాలని గీతం అధ్యక్షుడు, ఎంపీ ఎమ్‌.శ్రీభరత్‌ అన్నారు. గురువారం గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి (జిమ్‌సర్‌) వైద్య కళాశాలలో 2024 బ్యాచ్‌ నూతన ఎంబిబిఎస్‌ విద్యార్ధులకు ‘వైట్‌కోట్‌ ధారణ’లో మాట్లాడుతూ, రానున్న రోజులలో వైద్యరంగంలోకి సాంకేతిక పరిజ్ఞానం కీలక భూమిక పోషించనుందన్నారు. అయితే వృత్తి నైపుణ్యం, మానవ సంబంధాలు, రోగ లక్షణాలను విశ్లేషించి రోగికి మానసికంగా ధ్కెర్యం చెబుతూ వైద్యులు అందించే చికిత్సకు ప్రత్యామ్నాయం లేదన్నారు. ఒత్తిడికి లోనవకుండా వైద్య విద్యార్ధులు వృత్తిలోని నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఎపి అధ్యక్షుడు డాక్టర్‌ ఎమ్‌.జయచంద్రనాయుడు మాట్లాడుతూ వైద్య వృత్తిలోకి ప్రవేశించే వారు నిరంతర విద్యార్ధిగా ఉండాలని, విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. విశాఖ సిపి డాక్టర్‌ శంకబ్రత బాగ్చీ మాట్లాడుతూ మానవత విలువలు, సమాజం పట్ల బాధ్యతతో వైద్య వృత్తిలోకి ప్రవేశించాలని సూచించారు. కార్యక్రమంలో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు, జిమ్‌సర్‌ ప్రో వైస్‌ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ బి.గీతాంజలి, డీన్‌ డాక్టర్‌ ఎస్‌.పి.రావు, గీతం అసుపత్రి సూపరెండెంట్‌ డాక్టర్‌ వసంతకుమార్‌ పాల్గొన్నారు. వైద్య విద్యార్ధులకు సిపి తెల్లకోటును అందజేశారు.

➡️