ఉత్కంఠగా క్రికెట్‌ మ్యాచ్‌లు

ప్రజాశక్తి – కడప జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎసిఎ అండర్‌ -19 గ్రూపు బి అంతర్‌ జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌లోభాగంగా వై.ఎస్‌. రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో కష్ణా, శ్రీకాకుళం జట్ల మధ్య మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో కష్ణా జట్టు 219 పరుగులు చేసింది. రెండు వికెట్ల నష్టానికి 34 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండవ రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన శ్రీకాకుళం జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 43.0 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులోని సుశాంత్‌ 27, రోహిత్‌ కుమార్‌ 23 పరుగులు చేశారు. కష్ణా జట్టులోని యశ్వంత్‌ 4, సాయి ప్రకాష్‌ 2, గీత్‌ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కష్ణా జట్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 37.0 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 122 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధనుష్‌ 56 పరుగులు చేశాడు. కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలోచిత్తూరు వెస్ట్‌ గోదావరి జట్ల మధ్య మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో వెస్ట్‌ గోదావరి జట్టు 262 పరుగులు చేసింది. 3 వికెట్ల నష్టానికి 99 పరుగుల ఓవర్‌ నైట్‌ కోరుతూ రెండవ రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌ లో 83.0 ఓవర్లలో 288 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని హర్ష సాయి రెడ్డి 102 పరుగులు (సెంచరీ) చేశాడు. లోహిత్‌ లక్ష్మీనారాయణ 58 పరుగులు చేశాడు. వెస్ట్‌ గోదావరి జట్టులోని డి యశ్వంత్‌ అద్భుతంగా బౌలింగ్‌ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్ట్‌ గోదావరి జట్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 24.0 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఆ జట్టు లోని ప్రణీత్‌ పవన్‌ 34 పరుగులు చేశాడు. కెఒఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో నెల్లూరు జట్టుకు చెందిన బౌలర్‌ ఎస్‌.ఎస్‌. హమీద్‌ అద్భుతంగా బౌలింగ్‌ ప్రదర్శించి ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసుకొని రికార్డు సష్టించాడు. కడప జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేసింది. నెల్లూరు జట్టుకు చెందిన ఎస్‌.ఎస్‌. హమీద్‌ 23.4 ఓవర్లు బౌలింగ్‌ వేసి అందులో 5 ఓవర్లు మేడిన్‌ వేసి 83 పరుగులు ఇచ్చి 9 వికెట్లు తీసుకోవడం విశేషం. వికెట్‌ నష్టపోకుండా 6 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండవ రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన నెల్లూరు ఆట ముగిసే సమయానికి 78.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ఆ జట్టులోని మన్విత్‌ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్‌ లో రాణించి 134 పరుగులు (సెంచరీ) చేశాడు. ఎస్‌.ఎస్‌. అమీద్‌ 66, కారుణ్య 64 పరుగులు చేశారు. కడప జట్టులోని ధీరజ్‌ కుమార్‌ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నాడు.

➡️