ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ విడుదల చేసిన మెగా డిఎస్సీ నుంచి ప్రస్తుతం ట్రైబల్ గురుకులంలో పని చేస్తున్న సుమారు1143 ఔట్ సోర్సింగ్ టీచర్ల పోస్టులను మినహాయించాలనీ శుక్రవారం గిరిజన గురుకుల విద్యాలయాల ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావుని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎపిటి డబ్ల్యు ఆర్ ఇఎస్ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ టీచర్స్ అనే విధానంలో పనిచేస్తున్న వారిని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ గా మార్పు చేయాలనీ, జీతాల పెంపుదల చేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు శంకరరావుని కోరారు. ఈరోజు విజయనగరం లోని ఎస్టీ కమిషన్ చైర్మన్ కార్యాలయంలో శుక్రవారం వారు చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు ను కలిసి తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకు వెళ్లారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 191 గిరిజన సంక్షేమ గురుకు విద్యా సంస్థలలో సుమారు 1633 మంది ఔట్ సోర్సింగ్ బోధనా సిబ్బంది గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. గిరిజన విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి నిబద్ధత, అంకిత భావంతో, అతి తక్కువ జీతాలతోపనిచేస్తూ, మంచి ఫలితాల సాధించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రోస్టర్ కమ్ మెరిట్ పద్ధతిలో పోస్టులు నియామకం జరిగిందనీ, ఫైనాన్షియల్ అప్రూవల్ కలిగివున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ విద్యాసంస్థలలో గానీ, గురుకుల వ్యవస్థలలో గానీ, ఔట్సోర్సింగ్ టీచింగ్ వ్యవస్థ లేదనీ, కేవలం గిరిజన గురుకులంలో మాత్రమే ఈ విధానముందన్నారు.ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు మాట్లాడుతూ గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన వుందనీ, గతంలో తాను గిరిజన గురుకులాలను సందర్శించిన నేపథ్యంలో అక్కడి ఉపాధ్యాయుల సమస్యలను స్వయం గా తెలుసుకోవడం జరిగిందన్నారు. ఒఎస్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సి ఆర్ టి లుగా మార్పు చేయాలనీ ఇప్పటికే కోరడం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు కమిషన్ దృష్టిలో వున్నాయనీ చెప్పారు. ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు తెలిపిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని ఆయన హామీ ఇచ్చారు.